బాలీవుడ్ సినిమా పరిశ్రమతో పాటు పలు ఇతర భాషల్లోనూ ఎన్నో వేల పాటలు పాడి ప్రేక్షకుల గుండెల్లో స్వరకోకిల గా పేరు సంపాదించిన లతా మంగేష్కర్ గారు నేడు మనల్ని విడిచి వెళ్లిపోవడం నిజంగా బాధరకం అనే చెప్పాలి. ఇక ఆమె మృతిపై పలువురు సినిమా రంగ ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు. 28 సెప్టెంబర్ 1929లో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో లతా మంగేష్కర్ జన్మించారు. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్, తల్లి షెవంటి మంగేష్కర్. హిందూ మాత సంప్రదాయాలు పాటించే మరాఠీ కుటుంబంలో ఆమె జన్మించారు.
వాస్తవానికి అంతకుముందే తండ్రి దీనానాథ్ కు మరొక స్త్రీతో పెళ్లి జరగడం, హఠాత్తుగా ఆమె మరణించడంతో రెండవ భార్యగా షెవంటిని ఆయన వివాహం చేసుకోవడం జరిగిందట. ఇంట్లోని వారందరిలో పెద్దామె అయిన లతా గారికి ఒక సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ మరియు ఉష మంగేష్కర్, ఆశ భోంస్లే, మీనా ఖదికార్ సోదరీమణులు ఉన్నారు. వాస్తవానికి ఆమె అసలు పేరు లతా కాదు, హేమ. చిన్నప్పుడు ఆమె తన తండ్రితో కలిసి ‘భావ్ బంధన్’ అనే ఒక నాటకంలో లతిక అనే పాత్రలో నటించి మంచి పేరు సంపాదించడంతో, అప్పటినుండి కుటుంబసభ్యులు ఆమెను లతా అని పిలవసాగారు.
కాగా ఆమె సోదరీమణుల్లో ఆశా భోంస్లే కూడా ప్రముఖ సింగర్ గా ఎంతో పేరు దక్కించుకున్నారు. ఇక చిన్నప్పటి నుండి చదువుపై లతా గారికి అంతగా శ్రద్ధ ఉండేది కాదట. అంతేకాక సంగీతం పట్ల ఎంతో మక్కువ ఉండడం, మరియు దానిని నేర్చుకునే క్రమంలో ఆమె స్కూల్ కి కూడా సరిగ్గా హాజరయ్యేవారు కాదట. ఆ విధంగా ఆమె విద్యాబ్యాసం స్కూల్ దశలోనే ఆగిపోయింది. అయితే చిన్నవయసులోనే తండ్రితో కలిసి కొన్ని నాటకాల్లో నటించిన లతా గారిని, ఆమెకు సంగీతం పట్ల గల ఆసక్తిని గ్రహించిన తండ్రి దీనానాథ్ ఆమెకు ఆ కళలో శిక్షణ కూడా ఇప్పించారట. ఇక ఇంట్లోని సంతానంలో వారందరిలో లతా గారే పెద్ద కావడంతో, తన సోదరుడు మరియు సోదరీమణుల జీవితంపై ఆమె ఎంతో శ్రద్ధ వహించేవారట.
ఆ విధంగానే తన మాదిరిగా ఒక సోదరైన ఆశాకు కూడా సంగీతం పట్ల గల మక్కువను గ్రహించి శిక్షణ ఇప్పించి, తనతో పాటు సినిమాల్లోకి రంగ ప్రవేశం చేయించారు. అలానే తన కుటుంబసభ్యులు అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే లతా గారు, మిగతా అక్క చెల్లెళ్లను, సోదరుడిని కూడా వారి అభిరుచుల మేరకు చదివించి వివాహాలు జరిపించడం జరిగింది. స్వతహాగా అప్పట్లో మరాఠీ స్త్రీలను ఎక్కువగా బయటకు రానిచ్చే వారు కాదట, అయినప్పటికీ తండ్రి దీనానాథ్ మాత్రం కూతుళ్ళకు ఎంతో స్వేచ్ఛనిచ్చి వారి అభిరుచుల మేరకు నడుకునేందుకు అవకాశం కల్పించేవారట……!!