మగవాళ్ళ చర్మానికి ఆడవాళ్ల చర్మానికి చాలా తేడా ఉంటుంది. సాధారణంగా చర్మ సంరక్షణ చర్యలు ఆడవాళ్లే ఎక్కువగా తీసుకుంటారు. ఆడవాళ్ళకి అందానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు కాబట్టి చర్మాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలని ఆశపడుతుంటారు. ఐతే ఆరోగ్యకరమైన వారొక్కరికే పరిమితం కాదు కదా.. అందుకే మగవాళ్ళు తెలుసుకోవాల్సిన చర్మ సంరక్షణ చర్యల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
మగాడివై ఉండి ఆడవాళ్ల ఫేస్ క్రీమ్ వాడతావా అనే టీవీ యాడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అది నిజమే. ఆడవాళ్ల చర్మానికి, మగవాళ్ళ చర్మానికి ఉండే తేడా కారణంగా ఆడవాళ్ళు వాడే ఫేస్ క్రీములు మగవాళ్ళ పెద్దగా ప్రభావం చూపవు. మగవారిలో కొల్లాజెన్ సాంద్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే చర్మం దళసరిగా ఉండి, ఆకృతి కూడా భిన్నంగా ఉంటుంది.
ఆరోగ్యకరమైన చర్మం కోసం రోజూ చేయాల్సిన పనులు..
ప్రతీరోజూ రెండుసార్లైనా ముఖం శుభ్రపరుచుకోవాలి. మగవాళ్లలో విడుదలయ్యే టెస్టోస్టిరాన్ కారణంగా చర్మం జిడ్డుగా మారుతుంది. అందువల్ల రోజూ కనీసం రెండు సార్లైనా శుభ్రంగా ముఖాన్ని కడుక్కోవాలి. దీని కోసం మీకు సూటయ్యే సబ్బు వాడటం ఉత్తమం. సాధారణంగా ముఖాన్ని శుభ్రపర్చుకునేటపుడు కంటికింద భాగాన్ని చాలా జాగ్రత్తగా శుభ్రపర్చుకోవాలి. కళ్ళ కింద భాగం చాలా సున్నితంగా ఉంటుంది.
చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచుకోవాలి. దీనికొరకు మాయిశ్చరైజర్స్ వాడాలి. సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్స్ వాడడం వల్ల సూర్యుని నుండి అతినీల లోహిత కిరణాల నుండి రక్షణ పొందవచ్చు. సన్ స్క్రీన్ లోషన్ వాడటం మర్చిపోవద్దు. సూర్యుని నుండి వచ్చే కిరణాల కారణంగానే చర్మం ముడుతలు పడి వయస్సు పెరిగినట్టుగా కనిపిస్తారు. అందుకే సన్ స్క్రీన్ లోషన్ ప్రతి రోజూ వాడాలి.