ఏడు నెలల్లో మూడు సార్లు పాము కాటు… రెండు సార్లు తప్పించుకున్నా, మూడో సారి మాత్రం…

-

అసలు పాములు పగబడుతాయా… ఇది నిజమేనా..? అంటే ఒక్కోసారి కొన్ని ఘటనలు చూస్తే మాత్రం నమ్మాల్సిన పరిస్థితి వస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సార్లు పాము కాటుకు గురైంది ఓ అమ్మాయి. రెండు సార్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా.. మూడోసారి మాత్రం ఓడిపోయింది.

ఈ దురదృష్టకర ఘటన ఆదిలాబాద్ జిల్లా బేల మండలం బెదోడ గ్రామంలో జరిగింది. బెదోడ గ్రామానికి చెందిన రైతు భలేరావు సుభాష్ ఏకైక కుమార్తె ప్రణాళి(18). ఆదిలాబాద్ లోని ఓ ప్రైవేటు కాలేజ్ లో డిగ్రీ చదువుతోంది. గత సెప్టెంబర్లో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చేతిపై పాము కాటేసింది. ఆసమయంలో చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడింది. వైద్య కోసం తల్లిదండ్రలు రూ. 4 లక్షలు ఖర్చు చేశారు. రెండోసారి ఈ ఏడాది జనవరిలో ఇంటి ముందర కూర్చొని ఉండగా… మరోసారి పాము కాటేసింది. అప్పుడు కూడా చికిత్స తీసుకుని కోలుకుంది. అయితే వరసగా పాము కాటేస్తుండటంతో అమ్మాయిని ఇంటి నుంచి బయటకు పంపేవారు కాదు పేరెంట్స్. కంటికి రెప్పలా కాపాడుకునేవారు.

అయితే తాజాగా హోలీ సందర్భంగా స్నేహితులకు రంగులు పూద్దామని రంగులు ఉన్న బ్యాగులో చేయిపెట్టగా.. అందులో ఉన్న పాము కాటేసింది. కుటుంబీకులు వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. రెండు సార్లు అమావాస్య రోజుల్లో, ఓ సారి పౌర్ణమి రోజుల్లో పాము కాటేసిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news