‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ వివాదాల‌కు హ‌ద్దులు లేవా… జ‌గ‌న్‌కు చేరుతున్న ఫిర్యాదులు..!

-

రాజ‌కీయాల్లోకి ఎప్పుడు వ‌చ్చామ‌న్న‌ది కాదు.. ఎంత‌గా దూకుడు చూపుతున్నామ‌న్న‌దే లెక్క‌.. అంటున్నారు గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కురాలు విడ‌ద‌ల ర‌జ‌నీ. గ‌త ఏడాది ఎన్నిక‌లకు కొద్ది నెల‌ల ముందుగా వైసీపీ తీర్థం పుచ్చుకున్న విడ‌ద‌ల.. పేట నుంచి మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావుపై విజ‌యం సాధించారు. అయితే, ఆమెకు టికెట్ ఇచ్చేందుకు దోహ‌ద ప‌డిన ఆ టికెట్‌ను త్యాగం చేసింది సీనియ‌ర్ నాయకుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌. ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ పిలుపు మేర‌కు మ‌ర్రి త‌న సీటును త్యాగం చేశారు. ఎన్నిక‌ల వేళ విడ‌ద‌ల విజ‌యం కోసం ప్ర‌య‌త్నించారు.

మొత్తానికి విడ‌ద‌ల తొలి ప్ర‌య‌త్నంలోనే ర‌జ‌నీ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. అయితే, గెలుపు గుర్రం ఎక్కిన త‌ర్వాత నుంచి ఆమె దూకుడుపెంచారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌కు స‌హ‌క‌రించిన మ‌ర్రిని ప‌క్క‌న పెట్టి ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌దీశార‌న్న చ‌ర్చ పేట రాజ‌కీయాల్లో వినిపిస్తోంది. ఆయ‌న ప్రాధాన్యం త‌గ్గేలా కామెంట్లు చేయ‌డం, త‌న అనుచ‌ర వ‌ర్గాన్ని పెంచుకోవ‌డం వంటికార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. దీంతో విడ‌ద‌ల అతి త‌క్కువ కాలంలోనే వివాదాల‌కు కేంద్రంగా మారిపోయారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా న‌ర‌స‌రావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులుపైనా విడ‌ద‌ల త‌న ఆధిప‌త్య ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించేలా రాజ‌కీయం న‌డ‌ప‌డం పేట రాజ‌కీయాల‌ను కాక పుట్టిస్తోంది. అదే స‌మ‌యంలో పేట ప‌క్క నియోజ‌క‌వ‌ర్గం అయిన తాడికొండ ఎమ్మ‌ల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవితోనూ ఓ స‌భ‌లో ఆమె బ‌హిరంగంగానే విబేధించారు. ఇక కొద్ది రోజులుగా పేట‌లో న‌ర‌సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులకు ర‌జ‌నీకి కొద్ది రోజులుగా పొస‌గ‌డం లేదు. తాజాగా ఎంపీ లావు శ్రీకృష్ణ కాన్వాయ్‌ని ఎమ్మెల్యే విడదల వర్గీయులు బుధవారం రాత్రి అడ్డగించారు. సుమారు అరగంటకు పైగా రోడ్డుపై బైఠాయించడంతో ఎంపీ కారులోనే ఉండిపోయారు.

కోటప్పకొండ తిరునాళ్లను పురస్కరించుకుని చిలకలూరిపేటలోని ఎమ్మెల్యే స్వ‌గ్రామం అయిన‌ పురుషోత్తమపట్నంలో ఏర్పాటు చేసిన భైరా వారి విద్యుత్‌ ప్రభ ఊరేగింపున‌కు బుధవారం రాత్రి శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. ఎంపీ ముందుగా స్థానిక లక్ష్మీపురంలో ఉన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్‌ నివాసగృహానికి వెళ్లారు. అక్కడ స్థానిక నాయకులతో కొద్దిసేపు సమావేశమయ్యారు. అనంతరం రాజశేఖర్‌ తనయుడు శ్రీనాథ్‌తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలతో పురుషోత్తమ పట్నం బైరావారి ప్రభ వద్దకు వెళ్లి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

ఆ తర్వాత బైరా కృష్ణ నివాసగృహంలో కొద్దిసేపు ఆగి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సమయంలో ఎమ్మెల్యే రజినీ వర్గీయులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని ఎంపీ కాన్వాయ్‌ని అడ్డగించారు. ఎంపీని తమ ప్రభల వద్దకు రావాలని ఎమ్మెల్యే ఆహ్వానించినా రాలేదని, పార్టీకి చెందనివారి ప్రభ వద్దకు ఎందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ర‌జ‌నీ మ‌రిది విడ‌ద‌ల గోపీ ఎంపీ కారులో ఉండ‌గానే కారు అద్దంపై పిడిగుద్దులు గుద్దుతూ వేలు పైకెత్తి చూపిస్తూ రెచ్చిపోయి వీరంగం ఆడేశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో కూడా జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.

ఈ ప‌రిణామం జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర ప్ర‌కంప‌న‌లు రేపింది. ర‌జ‌నీ తీరుపై సొంత పార్టీ నేత‌ల్లోనే విమ‌ర్శ‌లు ఎక్కువ అవుతున్నాయి. ఈ ప‌రిణామంతో ర‌జ‌నీ దూకుడుపై నేరుగా జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కే ఫిర్యాదు వెళ్లింద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే జిల్లా వ్యాప్తంగా కూడా ర‌జ‌నీ వ్య‌తిరేకుల‌ను పెంచుకుంటున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news