మాన్ అఫ్ ది మ్యాచ్ పవార్…! పవార్‌ యార్కర్‌.. షా క్లీన్‌ బౌల్డ్‌

-

మహారాష్ట్రలో బిజెపి అంచనాలు వేసింది… అవును మహారాష్ట్రలో బిజెపి అంచనాలు వేసింది శరద్ పవార్ తనదైన రాజకీయం చేసి ఆ అంచనాలలో ఒక్క దానిని కూడా సాకారం కానివ్వకుండా అడ్డు పడ్డారు… గత అయిదేళ్ళు గా దేశం మొత్తం వింటున్న ఒకే ఒక్క మాట… అమిత్ షా చాణక్యుడు… బిజెపి జాతీయ అధ్యక్షుడి హోదాలో ఆయన చేసిన రాజకీయం దెబ్బకు అనేక రాష్ట్రాల్లో కాషాయ పాలన ఉంది. ఇక ఆయన హోం మంత్రి అయితే…? ఇక బిజెపిని ఎదురొడ్డి రాజకీయం చేయడం దాదాపుగా అసాధ్యమనే అనుకున్నారు అందరూ…

అధికారం చేపట్టిన వెంటనే… కర్ణాటకలో అమిత్ షా జెడిఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టారు… హర్యానాలో జేజేపి తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. మహారాష్ట్రలో కూడా అదే జరుగుతుందని ఆయన భావించారు…. దేశ ఆర్ధిక వ్యవస్థకు మహారాష్ట్ర కీలక రాష్ట్రం. ముంబైలాంటి నగరం ఉన్న రాష్ట్రం కావడంతో అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి పాలన చాలా అవసరం. అందుకే అమిత్ షా ఇక్కడ దూకుడు ప్రదర్శించారు. కర్ణాటకలో యడ్యురప్పకు బాధ్యతలు వదిలేసిన ఆయన… మహారాష్ట్రలో మాత్రం తానే రంగంలోకి దిగారు…

శివసేన బిజెపి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నాల్లో ఉందనే విషయం ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి అర్ధమవుతుంది… ముఖ్యమంత్రి పదవి చెరి సగం అని వాళ్ళు అంటున్నారు… కాని మాదే 5 ఏళ్ళు అని బిజెపి అంటుంది… అసలు పవర్ గేం లో కాంగ్రెస్, ఎన్సీపీ లేవు… సిద్దాంతాల పరంగా చూస్తే… తమతో శివసేన విడిపోతే… ఎన్సీపీ కాంగ్రెస్ తో కలవదు… కలిస్తే పార్టీలో అసంతృప్తులు వస్తాయి అని అమిత్ షా అంచనా అవేసారు. అనుకున్నట్టు గానే ఎన్సీపీ… శివసేనకు మద్దతు ఇచ్చే విషయంలో నానుస్తూ వచ్చింది.

ఈ పరిణామాన్ని ఎక్కువగా ఊహించుకున్నారు అమిత్ షా… ఎన్సీపీ అంగీకరించినా… కాంగ్రెస్ శివసేనతో కలిసే అవకాశం లేదని ఒక స్పష్టతకు వచ్చారు… ఇదే సమయంలో ముఖ్యమంత్రి పదవి విషయంలో శరద్ పవార్ ఒక కామెంట్ చేసారు. శివసేన ముఖ్యమంత్రి పదవి ఆశిస్తే తప్పేంటి అన్నట్టు మాట్లాడారు. దీనిని శివసేన పట్టుకుంది… వెంటనే శివసేన కీలక నేత సంజయ్ రౌత్… పవార్ ఇంటికి వచ్చేశారు… కాంగ్రెస్ ఒప్పుకుంటుందా…? అనే ప్రశ్న సంజయ్ నుంచి రాగానే… ఆ బాధ్యతను భుజాన వేసుకుని పవార్ ఢిల్లీ విమానం ఎక్కడానికి సిద్దమయ్యారు.

అప్పటికే సంజయ్ రౌత్ ఆయన్ను కలిసినట్టు మీడియాలో వార్త వచ్చింది… పొత్తు విషయంలో కాంగ్రెస్ ని అడిగి చెప్తానని విమానం ఎక్కే ముందు మీడియాతో ఒక వ్యాఖ్య చేసారు. దీనితో మాకు పవార్ ఎంతో విలువ ఇస్తున్నారని కాంగ్రెస్ పొంగిపోయింది… ఈ పరిణామాలు అన్ని జరుగుతుండగానే గవర్నర్ ఇచ్చిన గడువు ముగియక ముందే కేంద్ర కేబినేట్ రాష్ట్రపతి పాలన విధించిండం జరిగింది. ఇక అక్కడి నుంచి పరిణామాలు అంచనా వేయడానికి కూడా అవకాశం లేకుండా పోయాయి. శివసేనకు మద్దతు ఇవ్వడానికి సోనియా గాంధీ అంగీకరించలేదు…

మళ్ళీ ముంబై వచ్చి శరద్ పవార్ కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు. మనకు అధికారం ముఖ్యమని వాళ్లకు వివరించారు… బిజెపి అధికారంలోకి వస్తే మన మనుగడే ప్రశ్నార్ధకం చేస్తారని ఆయన కాంగ్రెస్ నేతలకు వివరించారు. ఆయన చెప్పిన మాటలు విన్న కాంగ్రెస్ నేతలు అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చారు. మళ్ళీ ఢిల్లీ విమానం ఎక్కిన శరద్ పవార్… అక్కడికి వెళ్లి సోనియా గాంధీతో సమావేశమై… 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న జెడిఎస్ కి మద్దతు ఇస్తే లేని తప్పు 56 మంది ఎమ్మెల్యేలు ఉన్న శివసేనకు తప్పు ఏంటి అని ప్రశ్నించారు.

సోనియా గాంధి పునరాలోచనలో పడ్డారు… మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు అధిష్టానం మీద ఒత్తిడి పెంచారు. మీడియాలో వార్తలు మాత్రం మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని వచ్చాయి. ఈ సమయంలో శివసేనతో కలిసి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు కదా అని మీడియా అడగగా… అవునా అని పవార్ ఇచ్చిన సమాధానం బిజెపికి ఎక్కడ లేని హుషారు ఇచ్చింది… వెంటనే భూపేంద్ర సింగ్ ని అమిత్ షా రంగంలోకి దింపి… అజిత్ పవార్ ని కుటుంబం నుంచి చీల్చారు… ఆయనతో కలిసి సూర్యోదయానికి ముందే దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసారు.

ఇక ఆయనపై ఉన్న కేసులకు మహారాష్ట్ర ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. తనతో ఎమ్మెల్యేలు వస్తారని అజిత్ చెప్పిన మాటను… అమిత్ షా నమ్మేశారు… ఇక అజిత్ తో వెళ్ళిన ఎమ్మెల్యేల్లో ఏడుగురు మమ్మల్ని అజిత్ మోసం చేసారని వ్యాఖ్యానించడం శరద్ వెంటే ఉంటామని చెప్పడం జరిగిపోయాయి. అసలు వెనుక ఏం జరుగుతుందో అమిత్ షాకు ఒక అంచనా కూడా రాలేదు… తన భార్యను… అజిత్ పవార్ తో మాట్లాడేందుకు రంగంలోకి దింపారు. ఎమ్మెల్యేలు రావడం లేదనే స్పష్టత… వచ్చిన వెంటనే రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అజిత్…

2 గంటల తర్వాత ఫడ్నవీస్ కూడా రాజీనామా చేసారు. ఎక్కడ ఎలా నొక్కాలో అలా నొక్కారు పవార్… దేశం మొత్తం ఒక ఎత్తు అయితే… పవార్ ఒక్కరే ఒక ఎత్తు అనే విషయం అమిత్ షాకు స్పష్టంగా అర్ధమైంది. ఈ మొత్తం సీన్ లో శివసేన గాని కాంగ్రెస్ గాని ఎక్కడా కూడా పవార్ ని దాటి రాజకీయం చేయలేదు… ఆయన ఏం చెప్తే అదే మాట్లాడారు… అసలు మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు అయితే మీడియా ముందుకి కూడా రాలేదు… అజిత్ పవార్… బిజెపికి మద్దతు ఇవ్వగానే సీన్ అర్ధమైన వాళ్ళు సైలెంట్ గా ఇది పవార్ గేమ్ ప్లాన్ అనుకున్నారు… మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఒక యోధుడు అంటూ కితాభిచ్చారు. చివరిగా ఒక్క మాట… పవార్ పాలిటిక్స్ అర్ధం చేసుకోవడానికి అమిత్ షా తెలివి సరిపోలేదు…! థట్స్ ఇట్ మాన్ అఫ్ ది మ్యాచ్… శరద్ పవార్…!

Read more RELATED
Recommended to you

Latest news