సోష‌ల్ మీడియా టాక్స్ : కోతుల సీమ అని అనొచ్చా ?

-

ఓ ప్రాంతం మ‌రో ప్రాంతాన్ని ప్రేమించాలి
స‌ఖ్య‌త‌ను పెంపొందించుకోవాలి
సుహృద్భావం అల‌వ‌ర్చుకోవాలి
ఇవ‌న్నీ చేయ‌గ‌లిగితేనే మంచి పౌరులున్న  
స‌మాజ నిర్మాణం ఒక‌టి సాధ్యం
త‌గువులు వ‌చ్చినంత మాత్రాన ఉద్దేశ పూర్వ‌క వివాదాల సృష్టి  జ‌రిగినంత మాత్రాన ఓ ప్రాంతం రాత్రికి రాత్రి చెడ్డ‌ద‌యిపోదు.ఇప్ప‌టికీ కోన‌సీమ వాకిట ద‌ళితులూ, కాపులూ స‌ఖ్య‌త‌తోనే ఉన్నారు. ఉంటారు కూడా ! కాపు నాడు కూడా ఇదే చెబుతోంది.కానీ మీడియాలో ప‌నిచేసే కొంద‌రు ఆ పాటి ఇంగితం కూడా లేకుండా వార్త‌లు రాస్తున్నారే.. ఫేస్బుక్ లో పోస్టులు పెడుతున్నారే !

ఇదెట్టా న్యాయం. అంటే తెలంగాణ‌లో ఇవాళ్టికీ డ్ర‌గ్ రాకెట్ లేదు న‌డుస్త లేదు అని అనుకోవాలా ? విమెన్ ట్రాఫికింగ్ లేదు అని అనుకోవాలా ? చైల్డ్ అబ్యూజ్ లేనే లేదు అని అనుకోవాలా ? చిన్నారి చైత్ర త‌రువాత అక్క‌డ ఆ త‌ర‌హా ఘ‌ట‌న‌లే లేవు అని అనుకోవాలా ? దిశ త‌రువాత అస‌లు హ‌త్యాచారాలు, హ‌త్యా రాజ‌కీయాలు లేనేలేవు అని అనుకోవాలా ? ఇంకా చెప్పాలంటే అక్కడ భూ క‌బ్జాలు జర‌గ‌డం లేదు..అక్క‌డి నాయ‌కులంతా చాలా అంటే చాలా గ్రేటు అని క్లిన్ యూ ఒక‌టి ఇష్యూ చేసి, అటుపై మౌనం వ‌హించాలా ? లేదా అక్క‌డ కులాల చిచ్చే లేదు అంతా స‌చ్ఛీలురే అని చెప్పుకుని స‌ర్దుకుపోవాలా  ? లేదు లేదు పాల‌మూరులో అస్స‌లు ఆక‌లి కేక‌లే లేవు.. మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ నేతృత్వంలో అక్ర‌మాలే లేవు అని స‌ర్దుకుపోవాలా? ఏ ప్రాంతం అయినా మ‌రో ప్రాంతంను గౌర‌వించాలి. త‌ప్పిదాలు, ఘోర‌మ‌యిన త‌ప్పిదాలు, దారుణాలు జ‌రిగిన‌ప్పుడు వాటిని ఒప్పుకోవాలి. వాటి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుని, చెడును వ‌దిలేయాలి.

తెలంగాణ మీడియాలో ప‌నిచేస్తున్న జర్న‌లిస్టు ఒక‌రు కోన‌సీమ త‌గాదాను దృష్టిలో ఉంచుకుని కోతుల సీమ అని వ్య‌వ‌హ‌రిస్తూ ఓ పోస్టు ఉంచారు. తీన్మార్ వార్త‌లు రాసే వ్య‌క్తిగా ఆయ‌నకు పేరుంది. ఉంటే ఉండ‌నీ, గ‌తంలో మంచి జ‌ర్న‌లిస్టు అన్న‌ది ఓ అవార్డు కూడా ఉంది. ఉంటే ఉండ‌నీ కానీ ప్రాంతాల మ‌ధ్య స‌ఖ్య‌త పెంచాల‌న్న దృక్ప‌థం కొర‌వడితే వాళ్లెలా మంచి జర్న‌లిస్టులు అవుతారు. ఎందుక‌ని వీళ్లంతా ఇలా మాట్లాడుతున్నారు. విడిపోయినా ప్రాంతాలు వేర‌యినా తెలుగు వారంతా ఒక్క‌టే. నాయ‌కులు సృష్టించిన వైరుధ్యాల‌కు  ప్ర‌జ‌లు కొట్టుకు  చావాల్సిన ప‌నేం లేదు. అయినా కూడా ఇవాళ ఎవ‌రి వెత‌లు వారివి.. ఎవ‌రి బాధ‌లు వారివి..

ప్రాంతాలు ఎలా ఉన్నాయి.. వాటి ఉన్న‌తి ఎలా ఉంది అని ఎవ‌రికి వారు ఆలోచించాలి. ఒక‌రి ఉన్న‌తికి మ‌రొక‌రు కార‌ణం అయితే వైరుధ్యాలు ఉండ‌వు. సంయ‌మ‌నం ప్ర‌జ‌లే కాదు సంచల‌నం పేరిట నానా హ‌డావుడి చేసే మీడియాలు కూడా పాటించాల్సిందే ! కోన‌సీమ ను ఉద్దేశించి విషం చిమ్మొద్దు అని ఇప్ప‌టికే ఎంద‌రో విన్న‌విస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మ  స‌మ‌యంలో కూడా ఈ ప్రాంతానికి చెందిన వారు అంటే ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఎవ‌రి వాద‌న వారు వినిపించారే కానీ మ‌రో ప్రాంతంపై విద్వేషాలు చిమ్మిన దాఖ‌లాలు ఏమీ లేవు. విద్వేషం చిమ్మింది నాయ‌కులు..వాటిని మ‌న‌సుల్లో నింపింది నాయ‌కులు. వాటినే ఇప్పుడు జ‌ర్న‌లిస్టులు మ‌రోసారి వెలుగులోకి తెస్తున్నారా? అందుక‌నే ఆ ప్రాంతాన్ని కోతుల సీమ అని వ్య‌వ‌హ‌రిస్తున్నారా?

ప్ర‌తి ప్రాంతంలోనూ త‌ప్పిదాలు ఉంటాయి.. డ్ర‌గ్ రాకెట్ న‌డిచినంత‌నే హైద్రాబాద్ లో ఉన్న‌వారంతా చెడ్డ‌వారు అయిపోరు క‌దా..! అదేవిధంగా పేకాట క్ల‌బ్బులు ఉన్నంత‌నే భాగ్య న‌గ‌రి వాసులంతా వ్య‌స‌న దాసులు అని నిర్థార‌ణ చేయ‌కూడదు క‌దా! ఏ ప్రాంతం అయినా మంచీ,చెడూ రెండూ క‌ల‌బోత‌ల‌తోనే ఉంటాయి. అవును! ఇక్క‌డ అన‌గా ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌లో జ‌రిగే కోడి పందాల‌కు తెలంగాణ నుంచి నాయ‌కులు, వ్యాపార వ‌ర్గాల వారు ఇవాళ్టికీ వ‌స్తున్నారే ! అంటే వినోదం కావాల్సి వ‌స్తే ఈ ప్రాంతం వాళ్ల‌కు గుర్తుకు వ‌స్తుందా.. అదే వివాదం వ‌చ్చే స‌రికి ఈ ప్రాంతం వాళ్ల‌కు చెడ్డ‌ద‌యిపోయిందా? ఎవ‌రి చెడును వారే సంస్క‌రించాలి ..అప్పుడు మంచి స‌మాజం వ‌స్తుంది. విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టే విధంగా మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేసేవారు ఉండ‌కూడ‌దు గాక ఉండ‌కూడ‌దు. ఏ ప్రాంతం అయినా చెడును వ‌దిలించుకోవాలి. విద్వేషాల‌ను వ‌దిలించుకోవాలి. స‌ఖ్య‌త‌ను పెంపొందించే క్ర‌మాన ఆయా మీడియాలు ప‌నిచేస్తే వాటిపై కాస్తో,కూస్తో గౌర‌వం పెరిగి తీరుతుంది.
– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి 

Read more RELATED
Recommended to you

Latest news