కాంగ్రెస్ పార్టీ కొత్తరూపు సంతరించుకునేందుకు సిద్ధం అయింది. ఇప్పటికే ‘ నవ సంకల్ప్ చింతన్ శిబిర్’ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కుటుంబ పార్టీగా పేరు పడ్డ కాంగ్రెస్ పార్టీ ఒకే కుటుంబానికి ఒకే టికెట్ ఇస్తామని ప్రకటించింది. ఇదిలా ఉంటే మంగళవారం సోనియాగాంధీ అధ్యక్షతన ఏఐసీసీ సెక్రటరీలు, ఇంఛార్జ్ లతో సమావేశం అయ్యారు. అందుబాటులో ఉన్న వారిలో సోనియా గాంధీ సమావేశం నిర్వహిస్తున్నారు. చింతన్ శిబిర్ లో చేసిన తీర్మానాలపై చర్చ జరుగనుంది. సాధ్యమైనంత వేగంగా సంస్థాగత మార్పులు చేయాలనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. సంస్థాగత మార్పుల అమలుకు ‘ టాస్క్ ఫోర్స్’ నియామకం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో చర్చలు జరగుతున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లోని సభ్యులు కొంత మందితో ‘ సలహా మండలి’ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఎప్పటిప్పుడు పార్టీ అంతర్గతంగా ఎదుర్కునే పలు రాజకీయ సమస్యలను, సవాళ్లను సలహా మండలి పరిష్కరిస్తుందని ఇటీవల చింతన్ శిబిర్ లో సోనియా గాంధీ వెల్లడించిన సంగతి తెలిసిందే. రెండవ విడత “జన జాగరణ్ అభియాన్” జూన్ 15 నుంచి ప్రారంభం కానున్న తరుణంలో ఇందుకోసం కార్యక్రమాల నిర్వహణ కు సంబంధిన అంకాల పై చర్చించనున్నారు.