కరోనా వైరస్ దేశంలో రోజు రోజుకీ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే దేశమంతటా లాక్‌డౌన్ అమలవుతోంది. అయితే ఈ స్థితిలో ఇండ్లకే పరిమితమవుతున్న వారు హాస్పిటళ్లకు వెళ్లాలంటే రవాణా సౌకర్యం అందుబాటులో లేదు. దీంతో ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ఇకపై భారత్‌లో టెలీ మెడిసిన్ సేవలను ప్రారంభించనున్నారు. దీని వల్ల రోగి తన ఇంటి నుంచే వైద్యున్ని ఫోన్ కాల్, వీడియో కాల్ లేదా మెసేజ్‌ల ద్వారా కలిసి చికిత్స తీసుకోవచ్చు. ఈ క్రమంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టెలీ మెడిసిన్‌కు సంబంధించి తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.
చైనాలో ఆసుపత్రులు రద్దీగా మారిన నేపథ్యంలో అక్కడ టెలి మెడిసిన్ సేవలను అందించారు. దీంతో ఈ విధానం అక్కడ సూపర్‌హిట్ అయింది. ఈ క్రమంలో అదే తరహా సేవలను ఇక భారత్‌లోనూ ప్రారంభించనున్నారు. కరోనా నేపథ్యంలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు హాస్పిటళ్లకు వెళ్లడం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో టెలీ మెడిసిన్ ద్వారా అనేక మందికి ఉపయోగం కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. అందుకనే ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇక ఈ విధానం ద్వారా వైద్యులు చికిత్స చేయాలంటే ముందుగా వారు రిజిస్టర్ చేసుకుని ఉండాలి. అనంతరం రోగిని పైన తెలిపిన విధంగా ఎలక్ట్రానిక్ మాధ్యమంలో కలిసి అతని వయస్సు, పేరును సంబంధిత ధ్రువ పత్రాల ద్వారా నిర్దారణ చేసుకుని అతను చెప్పే అనారోగ్య లక్షణాలకు చికిత్స చేయవచ్చు. అందుకు అవసరం అయిన మందులను ప్రిస్క్రిప్షన్ రూపంలో రోగికి పంపించవచ్చు. దీంతో రోగి హాస్పిటల్‌లో వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తిని కూడా అరికట్టవచ్చు.
ఇక టెలీమెడిసిన్ సేవలు మొబైల్ యాప్, వెబ్‌సైట్ల ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు పలు ప్రైవేటు యాప్‌లు ఈ సేవలను అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం అధికారికంగా ఈ తరహా సేవలను ఇంకా ప్రారంభించలేదు. కానీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కేంద్రం టెలీమెడిసిన్ సేవలను ఎట్టకేలకు ప్రారంభిస్తోంది. దీని వల్ల హాస్పిటల్‌కు వెళ్లాల్సిన పనిలేకుండానే రోగి ఇంటి వద్దే వైద్య సేవలు లభిస్తాయి. అయితే రోగులకు ఎమర్జెన్సీ ఉంటే మాత్రం హాస్పిటళ్లకు వెళ్లాల్సిందే. కేవలం చిన్నపాటి అనారోగ్య సమస్యలకు మాత్రమే ఈ టెలీమెడిసిన్ సేవలను ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది..!