అన్ని కూరగాయల పంటలలో గోరు చిక్కుడు ఒకటి..ఈ గోరు చిక్కుడు అన్నీ వాతావరణ పరిస్థితులు వద్ద పెరుగుతాయి..సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు అనుకూలం. అధిక సాంద్రత గల బరువైన నేలలు పనికిరావు. ఉదజని సూచిక 7.5-8.0 మధ్య గల నేలలు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రకాల గోరుచిక్కుడు గింజల నుంచి జిగురు తయారు చేసి ఈ జిగురును బట్టలు, పేపరు, నూనె, బ్యూటీ ప్రోడక్ట్ ల తయారీలో వాడతారు.
గోరుచిక్కుడు లో అనువైన రకాలు..
పూసా మౌసమి : ఖరీప్ పంటకు అనువైనది. గింజ విత్తిన 70-80 రోజులకు మొదటి కోతకు వస్తుంది. కాయలు 10-12 సెం.మీ. పొడవు ఉంటాయి. మొక్క కొమ్మలతో ఉంటుంది.
పూసాసదాబహార్ : ఖరీఫ్, వేసవి పంటలకు అనువైనది. గింజ విత్తిన 45-50 రోజులకే మొదటి కోతకు వస్తుంది. కాయలు 12-13 సెం.మీ. పొడవు ఉంటాయి. మొక్క కొమ్మలతో ఉంటుంది.
పూసానవబహార్ : దీని కాయలు పూసా మౌసమిలా ఉంటాయి. మొక్క కొమ్మలు లేకుండా ఉంటుంది. ఖరీఫ్, వేసవి పంటలకు అనువైన రకం.వీటితో పాటు కొన్ని ప్రయివేట్ రకాలు కూడా కొన్ని ఉన్నాయి.
జనవరి రెండవ వారం నుండి ఫిబ్రవరి చివరి వరకు విత్తు కోవచ్చు. విత్తన మోతాదు ఎకరాకు 12-16 కిలోలు సరిపోతుంది. విత్తేముందు కిలో విత్తనానికి 5గ్రా. ఇమిడాక్లోప్రిడ్ మరియు 4గ్రా. ట్రైకోడెర్మ విరిడి కలిపి విత్తనశుద్ధి చేయాలి. నేలను అదును వచ్చే వరకు 4-5 సార్లు బాగా దున్నాలి. మొదటిసారి గోరుచిక్కుడు విత్తేటట్లయితే రైజోబియం కల్చర్ విత్తనానికి పట్టించుకోవడం మేలు.
ఎరువులు పశువుల ఎరువు మంచిది..ఎకరాకు 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులు వేసుకోవాలి. సగం నత్రజని, పూర్తి భాస్వరం, పొటాష్‌నిచ్చే ఎరువులను ఆఖరు దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన సగభాగం నత్రజని విత్తిన 30-40 రోజులకు వేసుకోవాలి..ఇక పోతే విత్తిన 3 రోజులకు నీళ్లను కట్టాలి..ఆ తర్వాత వారానికి ఒకసారి ఇస్తే సరిపోతుంది..
పేనుబంక, చిన్న, పెద్ద పురుగులు లేత చిగుళ్ళు, ఆకుల నుండి రసం పీల్చి నష్టం కల్గిస్తాయి. వీటి నివారణకు డైమిథోయేట్ లేదా ఫాసలోన్ లేదా ఫిప్రోనిల్‌ల లోని ఏదేని ఒక మందును 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చెయ్యాలి.. అప్పుడే ఛీడపీడల నుంచి రక్షణ వుంటుంది.. ఇంకేదైనా సమాచారం గురించి తెలుసుకోవాలంటే దగ్గరలోని వ్యవసాయ నిపునుల సలహా తీసుకోవడం మంచిది..