క్రీడల కంటే ఏ ఆటగాడు ఎక్కువ కాదని బుధవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలపై భారత జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ట్వీట్ చేసిన మరుటి రోజు కేంద్ర మంత్రి ఈ మేరకు స్పందించడం గమనార్హం. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు తాను అందుబాటులో ఉండటం లేదని విరాట్ కోహ్లీ, టెస్టు సిరీస్‌కు తాను అందుబాటులో ఉండటం లేదని రోహిత్ శర్మ బీసీసీఐకి సమాచారం అందించారు. క్రీడాకారులు విరామం తీసుకోవడం వల్ల నష్టమేమీ లేదు. కానీ, అందుకు సమయం, సందర్భం ఉండాలి. ఇది విరాట్ కోహ్లీ, రోహితశర్మ మధ్య విభేదాలను రుజువు చేస్తున్నదని అజారుద్దీన్ ట్వీట్ చేశారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నట్టు వస్తున్న ఆరోపణలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. స్పోర్ట్సే సుప్రీం. ఆట కంటే ఎవరూ పెద్దవారు కాదు. ఏ ఆటలో ఏ ఆటగాళ్ల మధ్య ఏం జరుగుతుందో నేను మీకు సమాచారం ఇవ్వలేను. ఇది ఆ ఆటకు సంబంధించిన సమాఖ్యలు/ సంఘాల పని. వారు సమాచారం ఇస్తేనే బాగుంటుంది అని అనూరాగ్ ఠాకూర్ అన్నారు.