కౌంటీలో అదరగొట్టిన అశ్విన్

భారత సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్లో అదరగొట్టాడు. సర్రే తరపున ప్రాతినిధ్యం వహించిన అశ్విన్ సోమర్‌సెట్‌ జట్టుపై రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేసాడు. ఆదివారం సోమర్‌సెట్‌, సర్రే మధ్య టెస్ట్ మ్యాచ్‌ మొదలైంది. ఈ మ్యాచ్ లో తొలి ఓవర్ వేసిన అశ్విన్‌ ఇటీవలే రికార్డు సృష్టించాడు. 11 ఏళ్ల తర్వాత కౌంటీ క్రికెట్లో తొలి ఓవర్‌ వేసిన స్పిన్నర్‌గా రికార్డు సాధించాడు. 2010లో జీతన్‌ పటేల్‌ ఫస్ట్ ఓవర్‌ వేయగా మళ్లీ ఇన్నాళ్లకు అశ్విన్ తొలి ఓవర్ వేశాడు.

ఈ మ్యాచ్ అయితే మొదటి ఇన్నింగ్స్ లో అశ్విన్ పెద్దగా ప్రభావం చూపలేదు. 43 ఓవర్లు వేసి కేవలం ఒకే వికెట్ తీసాడు. అయితే రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అశ్విన్ చెలరేగిపోయాడు. 15 ఓవర్లో 6 వికెట్లతో సోమర్‌సెట్‌ పతనాన్ని శాసించాడు. అశ్విన్ దెబ్బకు సోమర్‌సెట్‌ జట్టు రెండో ఇన్నింగ్స్ లో కేవలం 69 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో సోమర్‌సెట్‌ 429 పరుగుల భారీ స్కోరు చేయగా.. సర్రే తొలి ఇన్నింగ్స్ లో 240 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సోమర్‌సెట్‌ అశ్విన్ ధాటికి 69 పరుగులకు కుప్పకూలగా… ఐదో రోజు సర్రే జట్టు 106-4 పరుగులతో నిలవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న భారత జట్టు ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌ తో 5 టెస్టుల ఆడనున్న విషయం తెల్సిందే. అయితే ఈ మ్యాచ్ తో ఇంగ్లాండ్‌ సిరీస్ కు ముందు అశ్విన్‌కు మంచి ప్రాక్టీస్ లభించినట్లు అయింది.