ఇదీ వ‌న్‌సైడ్ మ్యాచే.. శ్రీ‌లంక‌పై నెగ్గిన ఆస్ట్రేలియా..!

-

335 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీ‌లంక ఓ దశలో 115 పరుగులకు వికెట్లేమీ కోల్పోకుండా ప‌టిష్ట స్థితికి చేరుకుంది. అయితే చెత్త షాట్లు ఆడిన లంక‌ ప్లేయ‌ర్లు వెంట వెంట‌నే ఔట‌య్యారు.

అస‌లే వ‌ర్షాల కార‌ణంగా మ్యాచ్ లు ర‌ద్దవుతుండ‌డంతో క్రికెట్ అభిమానులు ఓ వైపు విసుగెత్తిపోతున్నారు. దీనికి తోడు జ‌రిగే మ్యాచ్‌లన్నీ ఏక‌ప‌క్షంగా, చ‌ప్ప‌గా సాగుతుండ‌డం వారికి మ‌రింత విసుగు తెప్పిస్తోంది. ఇవాళ జ‌రిగిన ఆసీస్‌, లంక వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్ కూడా ఇలాగే సాగింది. ఆసీస్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని లంక బ్యాట్స్‌మెన్ మొద‌ట్లో ఛేదించేట్లుగానే క‌నిపించారు. కానీ చెత్త షాట్ల‌ను ఆడి అన‌వ‌స‌రంగా వికెట్ల‌ను స‌మర్పించుకోవ‌డంతో లంక జ‌ట్టుకు ఓట‌మి త‌ప్ప‌లేదు. ఫ‌లితంగా ఇవాళ జ‌రిగిన మ్యాచ్‌లో ఆసీస్ లంక‌పై 87 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన‌ ఆసీస్ జ‌ట్టు బ్యాటింగ్‌కు దిగగా.. ఆ జ‌ట్టు ప్లేయ‌ర్ల‌లో కెప్టెన్ ఆరోన్ ఫించ్ (132 బంతుల్లో 153 పరుగులు, 15 ఫోర్లు, 5 సిక్సర్లు), స్టీవెన్ స్మిత్ (59 బంతుల్లో 73 పరుగులు, 7 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించారు. దీంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 334 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక శ్రీ‌లంక బౌలర్లలో ఇసురు ఉదానా, ధనంజయ డి సిల్వాల‌కు చెరో 2 వికెట్లు ద‌క్క‌గా, లసిత్ మలింగాకు 1 వికెట్ ద‌క్కింది.

అనంతరం 335 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీ‌లంక ఓ దశలో 115 పరుగులకు వికెట్లేమీ కోల్పోకుండా ప‌టిష్ట స్థితికి చేరుకుంది. అయితే చెత్త షాట్లు ఆడిన లంక‌ ప్లేయ‌ర్లు వెంట వెంట‌నే ఔట‌య్యారు. దీంతో ఆ జ‌ట్టు 45.5 ఓవర్లలోనే 247 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ క్ర‌మంలో శ్రీ‌లంక ఓట‌మి పాలైంది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో కెప్టెన్ దిముత్ కరుణరత్నె (108 బంతుల్లో 97 ప‌రుగులు, 9 ఫోర్లు), కుశాల్ పెరీరా (36 బంతుల్లో 52 పరుగులు, 5 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించారు. ఇక మిగిలిన లంక‌ బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించ‌లేదు. కాగా ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ కు 4 వికెట్లు ద‌క్క‌గా, రిచర్డ్సన్ కు 3, ప్యాట్ కమ్మిన్స్ కు 2, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్ కు 1 వికెట్ ద‌క్కింది.

Read more RELATED
Recommended to you

Latest news