ఫిబ్రవరి 14న మాత్రమే ప్రేమించడం.. అలాగే అమ్మని మదర్స్ డే రోజే పూజించడం.. నాన్నను ఫాదర్స్ డే రోజు మాత్రమే గుర్తు చేసుకోవడం.. కాదు.. సంవత్సరంలో 365 రోజులూ ప్రేమిద్దాం.
సాధారణంగా చాలామంది అమ్మ గురించే మాట్లాడుతారు. అమ్మ నవమాసాలు మోస్తుంది. కంటుంది. మనల్ని పెంచి పెద్ద చేస్తుంది అని. కానీ మనం నాన్న వేలు పట్టుకునే కదా నడుస్తాం. చిన్నప్పుడు ఐదారేళ్ల వయసులో.. చాలామందికి నాన్నే సూపర్ హీరో. ఏమైనా చేయగలడు మా నాన్న అనుకుంటారు. నాన్న చేయలేనిది ఏదీ లేదనుకుంటారు. ఏ పది, పదకొండేళ్ల వయసులో.. డబ్బున్న వాళ్లని చూసినప్పుడు.. పెద్ద పెద్ద కార్లు ఉన్నవాళ్లని చూసినప్పుడు.. మా నాన్న అంత గొప్పోడు కాదేమో.. మా నాన్న కంటే గొప్పొళ్లు ఇంకా చాలామంది ఉన్నారనుకుంటారు.
పదిహేడు.. పద్దెనిమిదేళ్ల వయసులో.. బాగా చదువుకో.. రాత్రి పూట తొందరగా ఇంటికి రా.. అంటూ ఇలాంటి మాటలన్నీ నాన్న చెప్పినప్పుడు.. మా నాన్న నస పెడుతున్నాడు, చాదస్తం కాబోలు.. సరిగ్గా బతకడం తెలియకే ఇలా అయిపోయాడు.. అని అనుకుంటారు. ఇరవై, ఇరవై ఐదు ఏండ్లు వచ్చాక ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని.. ఓ ఇల్లు అద్దెకు తీసుకుని.. ఉద్యోగం చేస్తూ.. నెలాఖరులో అప్పులు చేయాల్సి వచ్చినప్పుడు నాన్న మనం అనుకున్నంత తక్కువేం కాదు.. బానే మేనేజ్ చేసినట్లున్నాడు.. నలుగురు పిల్లల్ని కన్నా.. మనకు ఇంత కష్టంగా ఉంది.. ఒకర్ని కూడా కనకముందే అనుకుంటారు.
ఆ తర్వాత.. ఓ ముప్పయి, ముప్పయి ఐదేళ్లు వచ్చాక.. పిల్లలు పెద్దవుతుంటే.. స్కూలు ఫీజులు.. రెకమండేషన్లు.. ఒంట్లో బాలేనప్పుడు హాస్పిటల్‌కు పరుగెత్తడం.. ఏదైనా కష్టం వస్తే డబ్బు కోసం వెతుక్కోవడాలు.. ఇలాంటివన్నీ ఎదురైనప్పుడు.. నాన్న గుర్తొచ్చి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఇన్ని కష్టాలు పడి మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడా అని. కానీ మనం అది అర్థం చేసుకునేలోపు.. చాలామంది నాన్నలు ఉండరు.. అందుకే నాన్న బతికి ఉండగానే థ్యాంక్స్ చెబుదాం.