బీసీసీఐ ఆగస్టు 15 తరువాతే టీమిండియా హెడ్ కోచ్ ఎంపిక ఉంటుందని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మరుసటి రోజే.. అంటే.. ఆగస్టు 16నే హెడ్ కోచ్ ఎవరనేది ప్రకటిస్తారని తెలిసింది.
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రితోపాటు ఇతర కోచ్‌లు, సహాయక సిబ్బంది కాంట్రాక్టు ముగియడంతో బీసీసీఐ ఆయా పోస్టులకు గాను ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించిన విషయం విదితమే. అందులో భాగంగానే టీమిండియా హెడ్‌కోచ్ పదవికి ప్రస్తుత కోచ్ రవిశాస్త్రితోపాటు టామ్ మూడీ, మైక్ హెసన్, ఫిల్ సిమన్స్, రాబిన్ సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్ సహా అనేక మంది మాజీలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే బీసీసీఐ మాత్రం కేవలం ఈ ఆరు మందిని మాత్రమే ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలిపింది.
కాగా బీసీసీఐ ఆగస్టు 15 తరువాతే టీమిండియా హెడ్ కోచ్ ఎంపిక ఉంటుందని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మరుసటి రోజే.. అంటే.. ఆగస్టు 16నే హెడ్ కోచ్ ఎవరనేది ప్రకటిస్తారని తెలిసింది. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ తోపాటు అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్ అడ్వయిజరీ కమిటీ భారత జట్టు ప్రధాన కోచ్‌ను ఎంపిక చేయనుంది. ఈ మేరకు పైన తెలిపిన ఆరు మందికి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించి అదే రోజున బీసీసీఐ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎవరనేది ప్రకటిస్తుందని తెలుస్తోంది.
కాగా కెప్టెన్ విరాట్ కోహ్లి, అన్షుమన్ గైక్వాడ్‌లు ఇప్పటికే బహిరంగంగానే రవిశాస్త్రికి మద్దతు పలికారు. దీంతో మళ్లీ ఆయనే కోచ్‌గా ఎంపికవుతారని వార్తలు వచ్చాయి. అయితే మరోవైపు కోచ్ ఎంపికలో కెప్టెన్ కోహ్లి ప్రమేయం ఏమీ ఉండదని, కోహ్లి అభిప్రాయాలను సదరు కమిటీ పరిగణనలోకి తీసుకోదని, ఆ కమిటీ స్వతంత్రంగానే వ్యవహరించి కోచ్‌ను ఎంపిక చేస్తుందని బీసీసీఐ కుండ బద్దలు కొట్టినట్లు తేల్చి చెప్పింది. దీంతో ఈ సారి కోచ్ ఎంపికలో కోహ్లి పప్పులేమీ ఉడకవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక రవిశాస్త్రికి ఇతర కోచ్ అభ్యర్థులైన టామ్ మూడీ, మైక్ హెసన్‌ల నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని అందరూ భావిస్తున్నారు.