దేశం ప‌రువు తీశారు.. 5వ టెస్టు క్యాన్సిల్ అయ్యాక బీసీసీఐపై అభిమానుల ఆగ్ర‌హం..

క్ర‌మశిక్షణ పాటించ‌డం అన్న‌ది నిజానికి మ‌న డిక్ష‌న‌రీలో ఉండ‌దేమో. ముఖ్యంగా క్రికెట్ విష‌యానికి వ‌స్తే ఈ విష‌యం బాగా వ‌ర్తిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. విదేశీ గ‌డ్డ‌పై ప్ర‌తిష్టాత్మ‌క మ్యాచ్‌ల‌ను ఆడుతున్నామ‌ని గొప్ప‌లు చెప్పుకుంటూనే మ‌రో వైపు కోవిడ్ మ‌హమ్మారి విజృంభిస్తున్న స‌మ‌యంలో నిర్ల‌క్ష్యంగా, క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యంగా ప్ర‌వ‌ర్తించి దేశం ప‌రువు తీశారు. వారి కార‌ణంగా భార‌త్‌పై పెద్ద మ‌చ్చ ఏర్ప‌డింది.

ఇంగ్లండ్‌తో శుక్ర‌వారం నుంచి జ‌ర‌గాల్సిన 5వ టెస్టు కోవిడ్ కార‌ణంగా క్యాన్సిల్ అయింది. జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ ర‌విశాస్త్రితోపాటు ఇద్ద‌రు స‌హాయ‌క కోచ్‌లు, ఆఖ‌రికి ఫిజియో కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఇది జరిగి 5 రోజులు అవుతోంది. అయితే పాజిటివ్ కేసులు మ‌ళ్లీ ఏవీ రాక‌పోవ‌డంతో మ్యాచ్ జ‌రుగుతుంద‌నే అనుకున్నారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా మ్యాచ్ జ‌రుగుతుంద‌ని గురువారం క‌న్‌ఫాం చేసింది. కానీ ఏం జ‌రిగిందో తెలియ‌దు, శుక్ర‌వారం ప్రారంభం కావ‌ల్సిన మ్యాచ్ ర‌ద్దైంది. దీంతో అభిమానుల్లో ఆగ్ర‌హం పెల్లుబుకుతోంది.

కేవ‌లం కొంద‌రి బాధ్య‌తా రాహిత్యంగా మ్యాచ్ అన‌వ‌స‌రంగా క్యాన్సిల్ అయింద‌ని, దీంతో భార‌త్ ఫోర్‌ఫీట్ కింద ఈ మ్యాచ్‌ను కోల్పోతుంద‌ని, ఫ‌లితంగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు విన్ ఇస్తార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. బ‌యో సెక్యూర్ బ‌బుల్ అంటూ ఊద‌ర‌గొట్టిన వారు ఇలా ఎందుకు ప్ర‌వర్తిస్తున్నారో, కోవిడ్ ను ఎందుకు అంటించుకుంటున్నారో అర్థం కావ‌డం లేదంటూ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. అయితే బీసీసీఐ మాత్రం మ్యాచ్ ఫోర్‌ఫీట్ అవ‌ద‌ని, మ‌ళ్లీ మ్యాచ్‌ను నిర్వ‌హించే ఏర్పాట్లు చేస్తామ‌ని, అందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నామ‌ని తెలిపింది. కానీ విదేశీ గ‌డ్డ‌పై భార‌త్ పరువు మాత్రం గంగ‌లో క‌లిపార‌న్న‌ది వాస్త‌వం.