టీమ్ ఇండియాకు షాక్.. వరల్డ్​ కప్​కు బుమ్రా దూరం

T20 ప్రపంచ కప్​కు ముందు భారత జట్టుకు షాక్ తగిలింది. గాయంతో బాధపడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ కప్​కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. బీసీసీఐ వైద్య బృందం అతడికి ఆడేందుకు అనుమతి ఇవ్వలేదని తెలిపింది.

నిపుణులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా ఇదివరకే.. సౌతాఫ్రికా సిరీస్​కు దూరమయ్యాడు. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన బుమ్రా ఆసీస్‌తో టీ20 సిరీస్‌ ఆడాడు. అయితే తాజాగా తిరువనంతపురం వేదికగా జరిగిన దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌ నుంచి వైదొలిగాడు.

ఇప్పటికే గాయం కారణంగా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వరల్డ్‌ కప్‌నకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా బుమ్రా కూడా లేకపోతే టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజయావకాశాలు సన్నగిల్లే ప్రమాదం లేకపోలేదు. పేస్‌కు సహకరించే ఆసీస్‌ పిచ్‌లపై బుమ్రా చెలరేగుతాడని ఆశించిన అభిమానులకు భంగపాటు తప్పేలా లేదు.