కోవిడ్ కారణంగా ఈ ఏడాది వేసవిలో జరగాల్సిన ఐపీఎల్ మధ్యలోనే వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఈ టోర్నీ రెండో దశను సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్నారు. అయితే వచ్చే ఏడాది ఎలాంటి ఆటంకాలు లేకుండా భారత్‌లోనే టోర్నీ జరుగుతుందని విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే 2022 సీజన్‌లో 8 కాకుండా 10 జట్లను ఆడించనున్నట్లు తెలుస్తోంది.
భవిష్యత్తులో ఐపీఎల్‌లో ఇంకో రెండు జట్లు చేరతాయని, దీంతో మొత్తం 10 జట్లు ఉంటాయని గతంలోనే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పారు. అయితే దాన్ని ఇంకా పొడిగించకుండా వచ్చే సీజన్ నుంచే 10 జట్లను ఆడించనున్నట్లు తెలుస్తోంది. అందుకు గాను రెండు కొత్త టీమ్‌లకు త్వరలో బిడ్డింగ్ ప్రక్రియ మొదలు కానున్నట్లు సమాచారం. ఇందుకు బీసీసీఐ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్తగా చేరే ఒక్కో జట్టుకు కొనుగోలు చేయాలంటే అవసరమైన బిడ్ వేసేందుకు గాను రూ.75 కోట్లను చెల్లించి డాక్యుమెంట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బిడ్ వేయాలంటే ఒక్కో కంపెనీ కనీసం ఏడాదికి రూ.3000 కోట్లకు పైగా టర్నోవర్‌ను కలిగి ఉండాలి.
గతంలో కొత్త టీమ్ ఒక్కొక్క దానికి రూ.1700 కోట్ల కనీస ధరను నిర్ణయించాలనుకున్నారు. కానీ దాన్ని రూ.2000 కోట్లకు పెంచనున్నట్లు తెలిసింది. అయితే బిడ్డింగ్ లో రెండు కొత్త టీమ్‌లకు కలిపి రూ.5000 కోట్ల వరకు ఆదాయం రాబట్టాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే 2022 సీజన్‌లో 10 జట్లు ఆడితే మొత్తం 74 మ్యాచ్‌లు అవుతాయి. దీంతో ప్రేక్షకులకు మరింత వినోదం లభిస్తుందని బీసీసీఐ భావిస్తోంది. అయితే కొత్త టీమ్‌లకు బిడ్‌లను వేసేందుకు 3 సంస్థలు కలిసి ఒకే బిడ్‌ను సమర్పించేందుకు కూడా బీసీసీఐ అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రెండు కొత్త టీమ్‌లకు కలిపి బీసీసీఐకి రూ.5000 కోట్ల ఆదాయం రావడం ఖాయంగా కనిపిస్తోంది.