ఐపీఎల్ 14వ సీజన్ మొదలై ఐదు రోజులు గడిచింది. అప్పుడే ఆటగాళ్ల గాయాలు జట్లకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. నెలన్నర రోజుల పాటు సాగే ఈ టోర్నమెంట్ లో గాయాలు మామూలే అయినప్పటికీ, మంచి మంచి ఆటగాళ్ళు గాయాల కారణంగా టోర్నీకే దూరమవడం అభిమానులను నిరాశపరిచే అంశం. తాజాగా రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు బెన్ స్ట్రోక్స్ ఆటకు దూరమవుతున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచులో క్రిస్ గేల్ క్యాచు పడుతున్నపుడు వేలికి గాయం కావడంతో టోర్నమెంట్ ఆడలేకపోతున్నాడు.
నిజానికి ముందుగా చిన్నగాయమే అనుకున్నారు. కానీ ఆ తర్వాత పరీక్షలు జరిపి వేలు విరిగిందని నెలరోజుల పాటు విశ్రాంతి అవసరమని అన్నారు. దాంతో బెన్ స్ట్రోక్స్ జట్టుకు దూరం అవుతున్నాడు. ఇప్పటికే జోఫ్రా ఆర్చర్ దూరం కావడంతో రాజస్తాన్ రాయల్స్ బలహీనపడింది. ఇప్పుడు స్ట్రోక్స్ కూడా దూరమవడం అటు జట్టుని ఇటు అభిమానులని నిరాశపరిచేదే. మరి కీలక ఆటగాళ్ళు లేకుండా టోర్నీ మొత్తం ఎలా నెగ్గుకువస్తారో చూడాలి.