ఐపీఎల్ 2022లో అద‌నంగా చేర‌నున్న రెండు కొత్త టీమ్స్‌.. 6 న‌గ‌రాల‌ను షార్ట్‌లిస్ట్ చేసిన బీసీసీఐ..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022లో మ‌రో రెండు కొత్త టీమ్‌ల‌ను చేర్చేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే 6 న‌గ‌రాల‌ను ఎంపిక చేసి వాటిని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. అయితే ఆ 6 న‌గ‌రాల్లో ద‌క్షిణాది న‌గ‌రాలు లేవు. ఉత్త‌రాదితోపాటు తూర్పు భార‌త‌దేశ ప్రాంతానికి చెందిన న‌గ‌రాల‌ను షార్ట్ లిస్ట్ జాబితాలో చేర్చింది.

గువాహ‌తి, రాంచీ, క‌ట‌క్‌, అహ్మ‌దాబాద్‌, ల‌క్నో, ధ‌ర్మ‌శాల న‌గ‌రాల‌ను షార్ట్ లిస్ట్‌లో ఉంచారు. వీటిల్లో నుంచి టెండ‌ర్లు వ‌చ్చే రెండు న‌గ‌రాల‌ను ఎంపిక చేస్తారు. అయితే రెండు ఫ్రాంచైజీల‌కు గాను ఒక్కో దానికి క‌నీసం రూ.2000 కోట్ల‌ను బేస్ ప్రైస్‌గా నిర్ణ‌యించ‌నున్నారు. ఈ క్ర‌మంలో టెండ‌ర్ ద్వారా రూ.5000 కోట్ల‌కు ఒక్కో టీమ్‌ను విక్ర‌యించాల‌ని బీసీసీఐ భావిస్తోంది.

ఇక ఆ 6 న‌గ‌రాల్లో అహ్మ‌దాబాద్ క‌చ్చితంగా ఎంపిక అవుతుంద‌ని తెలుస్తోంది. ఇంకో న‌గ‌రంగా ల‌క్నో లేదా గువాహ‌తిల‌లో ఏదైనా ఒక దాన్ని ఫ్రాంచైజీ కింద ఎంపిక చేస్తార‌ని స‌మాచారం. ఐపీఎల్‌ను ఎక్కువ‌గా చూస్తున్న‌వారిలో 65 శాతం మంది ప్రేక్ష‌కులు ఉత్త‌రాది, తూర్పు భార‌త దేశ ప్రాంతాల‌కు చెందిన వారే ఉంటున్నారు. అందువ‌ల్ల ఈ సారి ఫ్రాంచైజీల‌కు గాను బీసీసీఐ ఆ ప్రాంతాల‌కు చెందిన న‌గ‌రాల‌నే ఎంపిక చేసింది. అయితే చివ‌ర‌కు ఏ రెండు జ‌ట్లను ఖ‌రారు చేస్తార‌న్నది ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక‌వేళ 2 ఫ్రాంచైజీల‌ను అనుకున్న ప్ర‌కారం ఎంపిక చేసి, ఆట‌గాళ్ల‌కు వేలం నిర్వ‌హిస్తే వ‌చ్చే ఐపీఎల్ 2022లో 74 మ్యాచ్‌ల‌తో మొత్తం 10 జ‌ట్లు త‌ల‌ప‌డ‌తాయి.