ఐపీఎల్‌లో ఇద్దరు ఆటగాళ్ళకు కరోనా.. మ్యాచ్ వాయిదా

ప్రస్తుతం దేశమంతా కరోనా విజృంభిస్తున్న విషయం తెల్సిందే. కరోనా కోరలు చాచుతున్నప్పటికీ బయో బబుల్ లో బీసీసీఐ ఐపీఎల్‌ టోర్నీని విజయవంతంగా నడిపిస్తుంది. అయితే ఇలాంటి సమయంలో ఐపీఎల్‌లో ఒక్కసారిగా కరోనా కలకలం సృష్టించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో ఇద్దరు ఆటగాళ్ళు కరోనా బారిన పడ్డారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తితో పాటు బౌలర్ సందీప్‌ వారియర్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా సోమవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. ఈ మ్యాచ్ రీషెడ్యూల్ తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించనున్నట్లు ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది. కాగా కేకేఆర్ ఆటగాళ్ళు వరుణ్ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌ గాయపడ్డారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించగా, కరోనా టెస్టులు నిర్వహించిన వైద్యులు పాజిటివ్ అని నిర్ధారించారు. దీంతో కోల్‌కతా ఆటగాళ్ళతో పాటు సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా మిగిలిన వారందరికీ నెగెటివ్ రిపోర్ట్ వచ్చినట్లు సమాచారం.

కాగా ఇక నుంచి కోల్‌కతా శిబిరంలోని ఆటగాళ్లకు ప్రతి రోజూ ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేయనున్నారు. ప్రస్తుతం కోల్‌కతా ఆటగాళ్ళు, సిబ్బంది వారం రోజులు ఐసోలేషన్ లో ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా వీరి ద్వారా ఇతర ఆటగాళ్ళకు కరోనా సోకితే టోర్నీ నిర్వహణ సాధ్యం కాకపోవచ్చు. అయితే ఐపీఎల్ బయో బబుల్ లో విజయవంతంగా సాగుతుందనుకున్న సమయంలో ఆటగాళ్ళు కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది.