ఆ వార్త విని నా హార్ట్ బ్రేక్ అయింది.. కానీ : స్టార్ పేసర్ బుమ్రా

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు దూరమైనందుకు చాలా బాధగా ఉందని టీమ్‌ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. తనకు అండగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు తెలియజేశాడు. జట్టుకు దూరంగా ఉన్నా ఆస్ట్రేలియాలో హిట్‌మ్యాన్‌ సేన విజయ యాత్రను ఎంజాయ్‌ చేస్తానని పేర్కొన్నాడు.

‘టీ20 ప్రపంచకప్‌నకు దూరమయ్యానని తెలిసి బాధపడుతున్నా. ఏదేమైనా నేను ప్రేమించేవారి నుంచి సపోర్ట్‌, కేర్‌, విషెష్‌ దొరికినందుకు కృతజ్ఞతలు. నేను రికవరీ అవుతూనే మరోవైపు ఆసీస్‌లో టీమ్‌ ఇండియా జైత్ర యాత్రను ఆనందిస్తాను’ అని బుమ్రా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు.

వెన్ను గాయం కారణంగా బుమ్రా 2022లోనే ఆసియా కప్‌కు దూరమయ్యాడు. అతను కోలుకోవడానికి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఒక నెల గడిపినా ప్రయోజనం లేకపోయింది. బుమ్రా ఆడటం లేదని గత 10 రోజుల నుంచే వార్తలు వచ్చాయి. ఈ గాయం కారణంగానే దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ నుంచి కూడా జస్ప్రీత్ బుమ్రాను పక్కన పెట్టారు.