కోహ్లీ సేనకు బీసీసీఐ శుభవార్త

కరోనా నేపథ్యంలో క్రికెటర్లకు బయట తిరిగే స్వేచ్ఛ లేకుండా పోయింది. మ్యాచ్‌లు ఉండడంతో వారి సమయాన్ని క్వారంటైన్‌, బ‌యో బబుల్ లలోనే గడుపుతున్నారు. అయితే ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా జూన్‌ 18 నుంచి 22 వరకు భారత జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ ఆడనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది.

అయితే టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ కు, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ కు 42 రోజుల భారీ విరామం ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ళకు మానసికంగా ఉపశమనం కలిగించేలా బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుంది.వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ అనంతరం భారత జట్టుకు బ‌యో బబుల్ నుంచి 20 రోజుల బ్రేక్ ఇవ్వాలని నిర్ణయిచింది. ఆటగాళ్ళు, సిబ్బంది జూన్ 24న బయో బ‌బుల్ ను వీడి మ‌ళ్లీ జులై 14న బ‌బుల్ లోనికి వచ్చే అవకాశం కల్పించింది.

అయితే ఆటగాళ్ళు, సిబ్బంది మాత్రం యూకే విడిచి వెళ్ళవద్దని టీమ్ మేనేజ్‌మెంట్ సూచించింది. కరోనా నేపథ్యంలో ప్ర‌యాణాల‌పై నిషేధం విధిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని, అందుకే యూకేలోని తిరిగే అవ‌కాశం ఇస్తున్న‌ట్లు వెల్లడించింది. కాగా ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా టీమిండియా దాదాపు నాలుగు నెలలు అక్కడే ఉండాల్సి వస్తుంది. అయితే ఇది లాంగ్ టూర్ కావడంతో క్రికెటర్లు, సహాయ సిబ్బంది తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు బీసీసీఐ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఇక తాజాగా బ‌యో బబుల్ నుంచి 20 రోజుల బ్రేక్ ఇస్తుండడం ఆటగాళ్ళ మాన‌సిక ఉల్లాసానికి ఉపయోగపడనుంది.