భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మ ప్రసవం కోసం పెటర్నిటీ లీవ్ తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కోహ్లి ఆసీస్‌తో జరగనున్న మిగిలిన 3 టెస్టులకు అందుబాటులో ఉండడం లేదు. అయితే కోహ్లి అలా పెటర్నిటీ లీవ్ తీసుకోవడంపై కొందరు ఫ్యాన్స్ గతంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ధోనీని చూసి కోహ్లి బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. అయితే ఆ వివాదం అప్పటితో ముగిసింది కానీ.. మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ తేనె తెట్టెను కదిపినట్లు మళ్లీ ఆ వివాదాన్ని కదలించాడు. అయితే ఈ సారి ఫ్యాన్స్ గవాస్కర్‌పై ఫైర్ అవుతున్నారు.
బీసీసీఐ సాధారణ ప్లేయర్లకు ఒక రూల్, కోహ్లి లాంటి ప్లేయర్లకు ఒక రూల్ అమలు చేస్తుందని గవాస్కర్ అన్నాడు. సన్ రైజర్స్‌కు ఆడిన నటరాజన్‌కు ఐపీఎల్ జరుగుతున్న సమయంలో కుమార్తె జన్మించిందని, అయితే అతను ఇండియాకు రాకుండా అటు నుంచి అటే ఆస్ట్రేలియాకు వెళ్లాడని, ఇప్పటికీ అతను ఆస్ట్రేలియాలోనే ఉన్నాడని, జనవరి 3వ వారంలో అతను ఇండియాకు వస్తాడని, అప్పటి వరకు అతను తన కుమార్తెను చూడలేడని గవాస్కర్ తెలిపాడు. ఈ క్రమంలో ఇతర ప్లేయర్లకు ఒక రూల్, కోహ్లి లాంటి ప్లేయర్లకు ఒక రూల్‌ను అమలు చేయడం సరికాదన్నారు. అందులోనూ ఆసీస్‌తో మొదటి టెస్టు మ్యాచ్‌లో దారుణంగా ఓటమి పాలయ్యాక కోహ్లిని లీవ్‌పై ఎలా పంపిస్తారని ప్రశ్నించాడు. అతని లాంటి ఎక్స్‌పీరియెన్స్ ఉన్న బ్యాట్స్‌మెన్ ఇప్పుడు జట్టుకు అవసరం అని అన్నాడు. ఈ మేరకు గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్ కు ఒక కథనం రాశాడు.
అయితే గవాస్కర్ కామెంట్లపై కోహ్లి ఫ్యాన్స్ గరం గరం అవుతున్నారు. గవాస్కర్ లెజెండరీ ప్లేయర్ అని ఇలాంటి విషయాల్లో తలదూర్చకపోవడమే మంచిదని, లీవ్ తీసుకోవాలా, మ్యాచ్‌లు ఆడాలా అనేది ప్లేయర్ వ్యక్తిగత విషయమని, నటరాజన్ టీంలోకి కొత్తగా వచ్చినందున అతను అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడని, అందుకనే కుమార్తె జన్మించినా లీవ్ తీసుకోలేదని, ఇక కోహ్లి విషయం అలాంటిది కాదని.. పలువురు ఫ్యాన్స్ గవాస్కర్‌కు కౌంటర్ ఇచ్చారు. కాగా ఆసీస్‌తో తదుపరి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 26న ప్రారంభం కానుంది. అందుకు గాను టీంలో ఎవరిని తీసుకోవాలి, ఎవరికి ఉద్వాసన పలకాలి అనే విషయంపై టీమిండియా మేనేజ్‌మెంట్ తర్జన భర్జనలు పడుతోంది. అయితే మొదటి మ్యాచ్ లా కాకుండా ఈ మ్యాచ్‌లో టీమిండియా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.