వ‌రల్డ్‌క‌ప్‌ల‌లో కివీస్‌.. ఈసారైనా గెలుస్తుందా..?

-

ఈసారి కివీస్ జ‌ట్టుకు కేన్ విలియ‌మ్స‌న్ నాయ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా జ‌ట్టులో ప‌లువురు ఆట‌గాళ్లు కీల‌కం కానున్నారు. గ్రాండ్ హోం, శాంట్న‌ర్‌, నీషమ్‌ల రూపంలో చ‌క్క‌ని ఆల్‌రౌండ‌ర్లు ఉండ‌గా, విలియ‌మ్స‌న్ చురుకైన కెప్టెన్‌గా ఉన్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన దాదాపు ప్ర‌తి ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లోనూ న్యూజిలాండ్ పాల్గొంది. ఆ జ‌ట్టును ఎప్పుడూ విశ్లేష‌కులు ఫేవ‌రెట్ గా భావించలేదు. ఇప్పుడు కూడా ఆ జ‌ట్టును ఎవ‌రూ ఫేవ‌రెట్ అని చెప్ప‌డం లేదు. అయితే నిజానికి న్యూజిలాండ్ క్రికెట్ జ‌ట్టు అంత బ‌ల‌హీన జ‌ట్టేమీ కాదు. ఆల్‌రౌండ‌ర్లు, బ్యాట్స్‌మెన్‌, బౌల‌ర్ల‌తో ఎప్పుడూ స‌మ‌తూకంగా ఉన్న‌ట్లు మ‌న‌కు క‌నిపిస్తుంది. కానీ ఎప్పుడూ ఏదో ఒక‌టి తేడా కొడుతోంది. దీంతో కివీస్ జ‌ట్టుకు వ‌ర‌ల్డ్ క‌ప్ అంద‌ని ద్రాక్షే అవుతోంది. అయితే మ‌రి ఆ జట్టు ఈ సారైనా రాణిస్తుందా..? వ‌రల్డ్ క‌ప్ సాధించే అవ‌కాశాలు కివీస్‌కు ఎలా ఉన్నాయి ? అనే విష‌యాల‌ను ఒకసారి ప‌రిశీలిస్తే…

న్యూజిలాండ్ జ‌ట్టులో నిజానికి పెద్ద పెద్ద స్టార్లు ఎవ‌రూ లేరు. అయినా ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అనేక ఐసీసీ టోర్న‌మెంట్ల‌లో కివీస్ జ‌ట్టు ఆట‌గాళ్లు స‌మిష్టిగా ఆడారు. కొన్ని సార్లు అంచ‌నాల‌కు మించే రాణించారు. అలాగే ప‌లు వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌లోనూ కివీస్ నిల‌క‌డైన ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగించింది. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌ల‌లో అత్య‌ధిక సార్లు సెమీ పైన‌ల్స్ కు వెళ్లిన జట్టుగా కివీస్ రికార్డు సాధించింది. అయితే ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్‌ల‌లో ఎప్పుడూ విజేత కాలేక‌పోయినా.. కివీస్ ప్ర‌ధాన జ‌ట్ల‌కు మాత్రం గట్టి పోటీనే ఇస్తుంది.

2015వ సంవ‌త్స‌రంలో బ్రెండ‌న్ మెక్ క‌ల్ల‌మ్ నాయ‌క‌త్వంలోని కివీస్ జ‌ట్టు ఫైన‌ల్‌లో ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డి ఓడిపోయింది. ఆ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో కివీస్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. అయిన‌ప్ప‌టికీ అప్ప‌టి జ‌ట్టులో ఆడిన చాలా మంది ప్లేయ‌ర్లు ఇప్ప‌టి జ‌ట్టులోనూ ఉన్నారు. దీంతో ఈసారి ఎలాగైనా క‌ప్ సాధించాల‌ని కివీస్ ప్లేయ‌ర్లు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈసారి కివీస్ జూన్ 1వ తేదీన శ్రీలంక‌తో ప్ర‌పంచ క‌ప్ లో త‌న మొద‌టి మ్యాచ్‌ను ఆడ‌నుంది.

ఈసారి కివీస్ జ‌ట్టుకు కేన్ విలియ‌మ్స‌న్ నాయ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా జ‌ట్టులో ప‌లువురు ఆట‌గాళ్లు కీల‌కం కానున్నారు. గ్రాండ్ హోం, శాంట్న‌ర్‌, నీషమ్‌ల రూపంలో చ‌క్క‌ని ఆల్‌రౌండ‌ర్లు ఉండ‌గా, విలియ‌మ్స‌న్ చురుకైన కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే రాస్ టేల‌ర్ త‌న బ్యాటింగ్‌తో రాణించాల‌ని చూస్తుండ‌గా, పేస‌ర్లు బౌల్ట్‌, ఫెర్గూస‌న్‌లు కూడా ఈ సారి మంచి ఫాంలో ఉన్నారు. అయితే హిట్ బ్యాట్స్‌మ‌న్ కొలిన్ మ‌న్రో ఫాంలో లేక‌పోవ‌డం కివీస్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. అలాగే గ్రాండ్ హోం కూడా అంతంత మాత్రంగానే ఆడుతుండ‌డం కివీస్‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఇక లెగ్‌స్పిన్‌ను కివీస్ బ్యాట్స్ మెన్ స‌రిగ్గా ఎదుర్కోవ‌డం లేదు. ఇది కూడా జ‌ట్టు బ‌ల‌హీన‌త‌ల్లో ఒక‌టిగా ఉంది. ఇక భార‌త్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్గ‌నిస్థాన్‌, పాకిస్థాన్ జ‌ట్ల‌కు మంచి స్పిన్న‌ర్లు ఉన్నారు. మ‌రి వారిని కివీస్ బ్యాట్స్‌మెన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

ఇక కివీస్ జ‌ట్టు 1975 నుంచి ప్రపంచ‌క‌ప్‌లో ఆడుతుండగా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కసారి కూడా క‌ప్ గెల‌వ‌లేదు. అయిన‌ప్ప‌టికీ వ‌రల్డ్ క‌ప్‌ల‌లో 6 సార్లు సెమీఫైనల్‌కు చేరుకుంది. ఒక‌సారి ఫైన‌ల్ కు వెళ్లింది. ఇక ప్ర‌పంచ క‌ప్‌ల‌లో న్యూజిలాండ్ ఇప్ప‌టి వ‌ర‌కు 79 మ్యాచులు ఆడ‌గా, 48 మ్యాచ్‌ల‌లో గెలుపొందింది. 30 మ్యాచ్‌ల‌లో ఓట‌మి పాలైంది. ఒక మ్యాచ్ లో ఫ‌లితం తేల‌లేదు. ఈ క్రమంలో వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌లో కివీస్ విజ‌యాల శాతం 61.53 గా ఉంది. మ‌రి ఈ సారైనా కివీస్ అన్ని బ‌ల‌హీన‌త‌ల‌ను అధిగ‌మించి, స్పిన్న‌ర్ల‌ను ఎదుర్కొని వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ముందుకు సాగి టోర్న‌మెంట్‌లో విజ‌యం సాధిస్తుందా, లేదా అన్న‌ది తెలియాలంటే.. మ‌రికొద్ది రోజుల వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు..!

న్యూజిలాండ్ వ‌ర‌ల్డ్ క‌ప్ టీంలో ఉన్న ప్లేయ‌ర్లు:

కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), ట్రెంట్‌ బౌల్ట్‌, లాకీ ఫెర్గూసన్‌, మ్యాట్‌ హెన్రీ, కోలిన్‌ మన్రో, హెన్రీ నికోల్స్‌, ఇష్‌ సోధి, రాస్‌ టేలర్‌, టామ్‌ బ్లండెల్‌, గ్రాండ్‌హోమ్‌, మార్టిన్‌ గప్తిల్‌, టామ్‌ లేథమ్‌, జేమ్స్‌ నీషమ్‌, మిచెల్‌ శాంట్నర్‌, టిమ్‌ సౌథీ.

Read more RELATED
Recommended to you

Latest news