జయహో జగజ్జేత.. టీమిండియాకు ప్రధాని సహా పలువురు శుభాకాంక్షలు

-

టీ20 ప్రపంచకప్‌ 2024 భారతదేశానిదే. 17 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ టీమిండియా ప్రపంచ కప్ను రెండో సారి సగర్వంగా ముద్దాడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య భారత్‌ 7 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది. ఈ విజయం కోట్లాది మంది భారతీయులను ఆనందంలో ముంచెత్తింది. ఈ క్రమంలో టీమిండియాకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు టీమిండియాకు అభినందనలు తెలిపారు.

“అసాధారణ విజయం సాధించిన భారత క్రికెట్‌ జట్టుకు నా హృదయపూర్వక అభినందనలు. ఓటమిని ఎప్పటికీ అంగీకరించని స్ఫూర్తితో క్లిష్ట సమయాల్లోనూ అత్యద్భుత నైపుణ్యంతో పోరాడి గెలిచిన జట్టు మీది. వెల్‌డన్‌ టీం ఇండియా.. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం.” – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

 

‘‘ఛాంపియన్స్‌. తమదైన శైలిలో భారత్‌ టీ20 ప్రపంచకప్‌ను స్వదేశానికి తీసుకురానుంది. భారత క్రికెట్‌ జట్టు పట్ల గర్వపడుతున్నాం. ఈ మ్యాచ్‌ చరిత్రాత్మకం. మన క్రికెటర్ల ప్రదర్శన పట్ల 140 కోట్లకు పైగా భారతీయులు గర్వపడుతున్నారు. వాళ్లు కేవలం ట్రోఫీ మాత్రమే కాదు కోట్లాది ప్రజల హృదయాలు గెలిచారు’’ – ప్రధాని మోదీ

“టీ20 ప్రపంచకప్‌లో అత్యద్భుత విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. టోర్నమెంట్‌ మొత్తం నిరాటంక విజయాలను సాధించారు. అద్భుత క్యాచ్‌ పట్టిన సూర్యకుమార్‌కు, స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని అందించిన రోహిత్‌శర్మకు నా అభినందనలు.” – రాహూల్ గాంధీ 

Read more RELATED
Recommended to you

Exit mobile version