చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. మాంచెస్టర్‌లో జరుగుతున్న వన్డే మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. కాగా వర్షం పడే సమయానికి భారత్ 46.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (71 పరుగులు, 6 ఫోర్లు), విజయ్ శంకర్ (3 పరుగులు)లు క్రీజులో ఉన్నారు. అంతకు ముందు రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 140 పరుగులు చేసిన రోహిత్ హసన్ అలీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (57 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించాడు.
పాక్ బౌలర్లలో మహమ్మద్ అమీర్ 2 వికెట్లు తీయగా, హసన్ అలీ, వహబ్ రియాజ్‌లకు చెరొక వికెట్ దక్కింది. అయితే మాంచెస్టర్‌లో అంత భారీ వర్షమేమీ పడడం లేదు. సన్నని చిరు జల్లు కురుస్తోంది. దీంతో మ్యాచ్‌కు కొంత అంతరాయం ఏర్పడ వచ్చు కానీ.. మ్యాచ్ జరుగుతుందనే అభిమానులు భావిస్తున్నారు.