ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగిన విషయం తెల్సిందే. టీమ్‌ఇండియా జట్టులో ఒక ఆటగానికి కరోనా సోకిందని బీసీసీఐ నిర్ధారించిన ఏ క్రికెటర్‌కు కరోనా వచ్చిందనే విషయాన్ని రహస్యంగా ఉంచింది. అయితే కరోనా సోకింది వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌కే అని తాజాగా తెలిసింది. ఎనిమిది రోజుల క్రితమే అతనికి కరోనా సోకగా… ప్రస్తుతం పంత్ ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడు హోటల్ రూమ్‌లో ఉండటం లేదు కాబట్టి మిగతా ఆటగాళ్లకు కరోనా సోకలేదని బీసీసీఐకు చెందిన అధికారి తెలిపారు. యూరోలో భాగంగా లండన్‌లోని వింబ్లే స్టేడియంలో ఇంగ్లాండ్, జర్మనీ మధ్య జరిగిన మ్యాచ్ చూడటానికి పంత్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడే పంత్‌కు వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అనంతరం… బీసీసీఐ ఆటగాళ్ళకు విశ్రాంతి ఇచ్చింది. దీంతో ఈ హాలీ డేలో ఆటగాళ్ళు కుటుంబ సభ్యులతో బ్రిటన్ అంతా చుట్టివచ్చారు. ఇక జులై 14తో హాలీ డే ముగియడంతో జట్టు తిరిగి కలిసింది. ఈ సందర్భంగా పంత్ మినహా మిగిలిన జట్టు డర్హమ్‌కు పయనమైంది. డర్హమ్‌లో జూలై 20 నుంచి భారత జట్టు కౌంటీ ఛాంపియన్‌షిప్ ఎలెవన్ జట్టుతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. కాగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీసులో భాగంగా ఆగస్టు 4న తొలి టెస్టు మొదలవనున్న విషయం తెల్సిందే.