ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కామెన్ వెల్త్ గేమ్స్ లో భారత్ బోణి కొట్టింది. తొలి పతకాన్ని సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ లో 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజత పతకం అందుకున్నాడు. మొత్తం 248 కిలోలు ఎత్తి ఈ ఘనత సాధించాడు. మలేషియాకు చెందిన అనిక్ కస్డాన్ మొత్తం 249 కిలోలు ఎత్తి స్వర్ణం సాధించగా.. లంకకు చెందిన దిలంక కుమారా 225 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకం అందుకున్నాడు.
స్నాచ్ విభాగంలో సంకేత్ ఏ మాత్రం రిస్క్ తీసుకోలేదు. వరుసగా 107, 111, 113 కిలోలు ఎత్తాడు. అతడి ప్రధాన పోటీదారు అనిక్ కస్‌దాన్ తొలి అవకాశంలోనే 107 కిలోలు ఎత్తాడు. ఆ తర్వాత రెండు ఛాన్సుల్లో విఫలమయ్యాడు. క్లీన్ అండ్ జర్క్‌లో మొదటే 135 కిలోలు ఎత్తాడు. మొత్తం బరువును 248 కిలోలకు పెంచాడు. ఆ తర్వాత ప్రయత్నంలో అతడు గాయపడ్డాడు. మోచేతి బెణికింది. అయినా క్రీడాస్ఫూర్తితో మూడో లిఫ్ట్‌కు వచ్చి ఎక్కువ బరువు మోసేందుకు ప్రయత్నించి పూర్తి చేయలేకపోయాడు.
కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలవాలని సంకేత్ కలగన్నాడు. మహారాష్ట్రలో పాన్ షాప్, ఫుడ్‌స్టాల్ నడుపుకుంటున్న తన తండ్రికి సాయపడాలని అనుకున్నాడు. ‘నేను స్వర్ణం గెలిస్తే కచ్చితంగా గుర్తింపు లభిస్తుందని తెలుసు. నా తండ్రికి సాయపడాలన్నది నా కోరిక. ఆయన నాకు చేసిందానికి కృతజ్ఞతగా ఉండాలి’ అని సంకేత్ మీడియాకు చెప్పాడు. కాగా ఈ ఏడాది మొదల్లో సర్గార్ 256 కిలోలు ఎత్తి కామన్వెల్త్, జాతీయ రికార్డులను బద్దలు కొట్టడం గమనార్హం. మోచేతి గాయం కాకుంటే బహుశా ఆ ప్రదర్శనను రిపీట్ చేసేవాడేమో!