ఐసీసీ వరల్డ్ కప్ 2019లో వెస్టిండీస్ ఘనంగా బోణీ కొట్టింది. పాకిస్థాన్‌తో ఇవాళ జరిగిన వరల్డ్ కప్ రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ విజృంభించింది. వెస్టిండీస్ బౌలర్లు, బ్యాట్స్‌మెన్ సమిష్టిగా రాణించి పాక్‌కు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో పాక్.. విండీస్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. వరల్డ్ కప్ 2019ను చెత్తగా ప్రారంభించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019లో భాగంగా ఇవాళ నాటింగామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ ఏ దశలోనూ మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఓపెనింగ్ నుంచి చివరి వరకు పాక్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్లలో ఫఖర్ జమాన్(16 బంతుల్లో 22 పరుగులు, 2 ఫోర్లు, 1 సిక్సర్), బాబర్ అజాం (33 బంతుల్లో 22 పరుగులు, 2 ఫోర్లు), మహమ్మద్ హఫీజ్ (24 బంతుల్లో 16 పరుగులు, 2 ఫోర్లు), వహబ్ రియాజ్ (11 బంతుల్లో 18 పరుగులు, 1 ఫోర్, 2 సిక్సర్లు) మినహా ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. దీంతో కేవలం సగం ఓవర్లు కూడా ఆడకుండానే పాకిస్థాన్ జట్టు 21.4 ఓవర్లలో 105 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. కాగా విండీస్ బౌలర్లలో ఒషేన్ థామస్ 4 వికెట్లు తీయగా, కెప్టెన్ జాసన్ హోల్డర్ 3 వికెట్లు తీశాడు. అలాగే ఆండ్రూ రస్సెల్‌కు 2 వికెట్లు, షెల్డన్ కాట్రెల్‌కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ మొదట్నుంచీ దూకుడుగా ఆడింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా క్రిస్ గేల్ 34 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం షై హోప్ 11 పరుగులకు, డారెన్ బ్రావో 0 పరుగులకే ఔట్ అవ్వగా, నికోలాస్ పూరాన్ (19 బంతుల్లో 34 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), షిమ్రాన్ హిట్‌మైర్ (8 బంతుల్లో 7 పరుగులు)లు మ్యాచ్‌ను పూర్తి చేశారు. ఈ క్రమంలో 13.4 ఓవర్లలోనే వెస్టిండీస్ జట్టు పాక్ నిర్దేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్లను కోల్పోయి విండీస్ 108 పరుగులు చేసింది. దీంతో పాక్‌పై విండీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరల్డ్ కప్‌ను ఘనంగా ప్రారంభించింది.