మంగళగిరి నుంచి విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, చిలకలూరిపేట టికెట్‌ను త్యాగం చేసిన మర్రి రాజశేఖర్‌కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వైఎస్సార్ పెన్షన్ పథకం ఫైలుపై తన తొలి సంతకం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే జగన్ ఏపీలో వ్యవస్థల ప్రక్షాళన దిశగా ప్రస్తుతం ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే పలువురు ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను బదిలీ చేశారు. ఇక మరోవైపు రాష్ట్ర మంత్రివర్గం కూర్పుపై కూడా జగన్ దృష్టి సారించారు. ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న ఆలోచనలో ప్రస్తుతం జగన్ వైకాపా నేతలతో చర్చలు జరుపుతున్నారు. మంత్రివర్గ కూర్పుపై జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.
కాగా జగన్ తన మంత్రివర్గంలోకి ఎమ్మెల్యేలనే కాకుండా ఎమ్మెల్సీలను కూడా తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే పాదయాత్ర, ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురికి ఎమ్మెల్యేలుగా గెలిస్తే మంత్రి పదవులు ఇస్తానని జగన్ ముందే మాట ఇచ్చిన నేపథ్యంలో వారితోపాటు పలువురిని మంత్రులుగా జగన్ ఎంపిక చేస్తారని తెలిసింది. ఈ క్రమంలో మంగళగిరి నుంచి విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, చిలకలూరిపేట టికెట్‌ను త్యాగం చేసిన మర్రి రాజశేఖర్‌కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మొత్తం 40 మందికి సీఎం జగన్ తన కేబినెట్‌లో మంత్రులుగా అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. ఇక జూన్ 8వ తేదీన ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తుండగా, జూన్ 15న లేదా ఆ తరువాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిసింది. 3 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుందని తెలుస్తోంది.
జిల్లాల వారీగా మంత్రి పదవులను ఆశిస్తున్న వైకాపా ఎమ్మెల్యేలు, నేతల జాబితా ఇదే..!
1. శ్రీకాకుళం – మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), కళావతి (పాలకొండ), రెడ్డి శాంతి (పాతపట్నం)
2. విజయనగరం – బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), పుష్ప శ్రీవాణి (కురుపాం), రాజన్నదొర (సాలూరు)
3. విశాఖపట్నం – గుడివాడ అమరనాథ్ (అనకాపల్లి), గొర్లె బాబూరావు (పాయకరావుపేట), ముత్యాల నాయుడు (మాడుగుల)
4. తూర్పుగోదావరి – సుభాష్ చంద్రబోస్ (ఎమ్మెల్సీ కోటా), కన్నబాబు (కాకినాడ రూరల్), దాడిశెట్టి రాజా (తుని)
5. పశ్చిమగోదావరి – ఆళ్ల నాని (ఏలూరు), తెల్లం బాలరాజు (పోలవరం), తానేటి వనిత (కొవ్వూరు), గ్రంథి శ్రీనివాస్ (భీమవరం)
6. కృష్ణా – పేర్ని నాని (మచిలీపట్నం), ఉదయభాను (జగ్గయ్యపేట), పార్థసారథి (పెనమలూరు), మేకా వెంకట ప్రతాప్ అప్పారావు (నూజివీడు)
7. గుంటూరు – ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి), మర్రి రాజశేఖర్ (ఎమ్మెల్సీ కోటా), అంబటి రాంబాబు (సత్తెనపల్లి), కోన రఘుపతి (బాపట్ల)
8. ప్రకాశం – బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), ఆదిమూలపు సురేష్ (యర్రగొండపాలెం)
9. నెల్లూరు – మేకపాటి గౌతంరెడ్డి (ఆత్మకూరు), రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి (కావలి), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి)
10. చిత్తూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు), కరుణాకర్ రెడ్డి (తిరుపతి), రోజా (నగరి)
11. కడప – శ్రీకాంత్ రెడ్డి (రాయచోటి), అంజాద్ బాషా (కడప)
12. కర్నూలు – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (డోన్), శ్రీదేవి (పత్తికొండ), హఫీజ్ ఖాన్ (కర్నూలు)
13. అనంతపురం – అనంత వెంకట్రామి రెడ్డి (అనంతపురం), కాపు రామచంద్రా రెడ్డి (రాయదుర్గం), శంకర్ నారాయణ (పెనుగొండ)