Manike Mage Hithe: సంగీతానికి అవధులు ఉండవని మరోసారి నిరూపించింది ప్రముఖ శ్రీలంక సింగర్, రాపర్ యొహానీ డిలోకా డిసిల్వా. ఆమె పాడిన మనికె మగే హితే అనే పాట ఇంటర్నెట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. దేశ సరిహద్దులు దాటి కోట్లాది సంగీతాభిమానుల మనసులను దోచుకుంది. ఆమె పాడిన పాట యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ పైగా దక్కించుకుంది. అలాగే, శ్రీలంక, ఇండియా, మాల్‌దీవ్స్ టాప్ 100 ఐట్యూన్స్‌లో నంబర్ ఒన్‌గా, స్పాటిఫై ఇండియా, స్పాటిఫై గ్లోబల్‌లో టాప్ వైరల్ 50గా కొనసాగుతోంది.
ఇక.. యొహానీ పాటకు వచ్చిన రీమేక్ సాంగ్స్ కూడా మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోందంటే ఈ పాట క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఇటు ఆమె పాటను అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్‌లాంటి బాలీవుడ్ స్టార్లు సైతం షేర్ చేశారంటే.. ఆమె గొంతు.. వారిని ప్రభావితం చేసిందో అర్థంచేసుకోవచ్చు.
ఈ తరుణంలో సింహాల సింగర్ యొహానీ డిలోకా డిసిల్వా బంపర్ ఆఫర్ కొట్టేసింది. తన స్వరంతో మిస్మారైజ్ చేయడానికి బాలీవుడ్ లోకి తెరంగేట్రం చేస్తోంది. ఇంద్రకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న బాలీవుడ్ సినిమా థ్యాంక్ గాడ్‌లో తన స్వరాన్ని వినే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ పాటను రష్మి విరాగ్ రాయగా, తనిష్క్ బాగ్చి స్వరపరిచారు. థాంక్ గాడ్ మూవీలో అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ్ మల్హోత్రా ,రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.