ఎట్టకేలకు చంద్రబాబు టీడీపీని ప్రక్షాళన చేసే దిశగా నడుస్తున్నారు. ఘోర ఓటమిని ఎదురుకుని ఏడాది దాటిన తర్వాత బాబు, టీడీపీలో కొత్త మార్పులు చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడుని నియమిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అధ్యక్షుడుగా ఉన్న కళా వెంకట్రావుని తప్పించి, ఆయన స్థానంలో అచ్చెన్నని పెట్టనున్నారని తెలుస్తోంది.
అలాగే జిల్లాల వారీగా అధ్యక్షులని తీసేసి, పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించనున్నారని సమాచారం. 25 స్థానాలకు 25 మంది కొత్త అధ్యక్షులని నియమించనున్నారు. ఇక శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానం బాధ్యతలు ఫైర్ బ్రాండ్ కూన రవికుమార్‌కు అప్పగించనున్నారని తెలుస్తోంది. కూన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం బామ్మర్ది అనే సంగతి తెలిసిందే. తమ్మినేని వైసీపీలోకి వెళితే, కూన టీడీపీలోనే ఉంటూ సిక్కోలు టీడీపీలో కీలక నేతగా ఎదిగారు.
2009లో ఆమదాలవలస నుంచి పోటీ చేసి ఓడిపోయిన కూన, 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బావ తమ్మినేనిపై గెలిచి సత్తా చాటారు. అలాగే అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో విప్‌గా పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో అదే తమ్మినేని చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన సరే కూన దూకుడుగా ఉంటున్నారు. ఏ మాత్రం తగ్గకుండా వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. అందుకే కూనకు సిక్కోలు బాధ్యతలు అప్పగిస్తే ప్లస్ అవుతుందని బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
పైగా కళింగ సామాజికవర్గానికి చెందిన కూనకు బాధ్యతలు అప్పగిస్తే, తమ్మినేనికి చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారు. దానికి తోడు కూన దూకుడు కలిసిరావొచ్చు. ఇదే సమయంలో ప్రస్తుతం జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న గౌతు శిరీషని కేవలం పలాసకు పరిమితం చేయొచ్చు. సిక్కోలులో గౌడ సామాజికవర్గం తక్కువ కాబట్టి, కళింగ వర్గానికి చెందిన కూనకు బాధ్యతలు అప్పగిస్తేనే టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-vuyyuru subhash