టీమిండియా పేరిట ఉన్న చెత్త రికార్డును శ్రీలంక చెరిపేసింది. వన్డేల్లో ఎక్కువ మ్యాచ్ లు ఓడిపోయిన జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇప్పటివరకు మొత్తం 860 వన్డే మ్యాచ్ లు ఆడిన శ్రీలంక 428 మ్యాచ్ లలో ఓటమి పాలవగా… 390 విజయాలు నమోదు చేసింది. కాగా శ్రీలంక తర్వాత ఎక్కువ మ్యాచ్ లు ఓడిపోయిన జట్లలో భారత్(india) రెండో స్థానంలో ఉంది. భారత్ ఇప్పటివరకు 993 మ్యాచ్ లు ఆడగా 427 మ్యాచ్ లలో పరాజయం పాలయింది.
అయితే విన్ పర్సంటేజ్ పరంగా చూస్తే శ్రీలంక కన్నా భారత్ మెరుగైన స్థానంలోనే ఉంది. భారత్ విన్ పర్సంటేజ్ 54.67 శాతం కాగా శ్రీలంక విన్ పర్సంటేజ్ 47.69 శాతంగా ఉంది. ఈ జాబితాలో 414 ఓటములతో పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది. ఇక టీ20 ఫార్మాట్ లోనూ అత్యధిక ఓటములు కలిగిన జట్టుగా శ్రీలంక(70) తొలి స్థానంలో ఉండడం గమనార్హం.
ప్రస్తుతం శ్రీలంక ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఇంగ్లండ్ పర్యటన ముందు శ్రీలంక 858 మ్యాచ్ లలో 426 ఓటములతో రెండో స్థానంలో ఉండగా… 427 ఓటములతో టీమిండియా తొలి స్థానంలో ఉంది. అయితే ఇంగ్లండ్ చేతిలో వరుసగా రెండు వన్డేలలో ఓటమిపాలవడంతో భారత్ పేరిట ఉన్న చెత్త రికార్డును శ్రీలంక తన పేరిట లిఖించుకుంది. ఈ పర్యటన అనంతరం జులై 13 నుంచి శ్రీలంక తన సొంతగడ్డపై శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత్ జట్టును ఢీ కొట్టనుంది. ఈ సిరీస్ లో భాగంగా ఇరు జట్లు 3 వన్డేలు, 3 టీ20ల్లో తలపడనున్నాయి.