రాజకీయాల్లో ఉన్న వారే ప్రత్యర్థులుగా ఉంటారని అనుకుంటే పొరపాటు. రాజకీయాలకు మించిన పగలు, ప్రతీకారాలు, అంతు చూడడం వంటి పరిణామాలు మీడియాలోనూ జరిగాయి. జరుగుతున్నాయి. తమ అను కున్న నేతలను అధికారంలోకి తెచ్చేందుకు, కాదనుకున్న వారి విలువల వలువలు ఊడ్చేందుకు కూడా మీడియా చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికీ ఇవి జరుగుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్‌ను అధికారంలోకి తెచ్చినదదాదిగా.. ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడం నుంచి పార్టీని ఆయన పరం చేసే వరకు ఓ పెద్ద పత్రిక అన్నీ తానై వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో చంద్రబాబును వ్యతిరేకించే వారిని టార్గెట్ చేయడం, బాబు పాలనలోని లోపాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడడం వంటి చర్యలకు ఈ ప్రధాన పత్రిక అనేక విధాల శ్రమించింది. ఈ క్రమంలోనే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతోనే వైరాన్ని సాగించింది. ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా ఆయనతోనే నేరుగా ఈ పత్రికాధిపతి లేఖల యుద్ధం చేసుకున్నారు.
ఇక, 2004లో చంద్రబాబును మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకు కూడా `ఈయన` శ్రమదానం అంతా ఇంతా కాదు. అయితే, అప్పటి వైఎస్ పాదయాత్ర పుణ్యంతో ఆయన అధికారంలోకి వచ్చారు. అయినా కూడా వైఎస్ అధికారంలోకి వచ్చిన మర్నాడు నుంచే వ్యతిరేక వార్తలతో ఉక్కిరి బిక్కిరి చేసింది `ఈ` పత్రిక. నిత్యం వ్యతిరేక వార్తలతో ప్రతిపక్షాన్ని మించిన ప్రతిపక్షంగా వ్యవహరించింది. నేరుగా వ్యక్తి గత ద్వేషాలను కూడా ఒండివార్చింది. ఈ నేపథ్యంలో వైఎస్ విసిగి వేసారి.. తమకు కూడా సొంతగా ఓ మీడియా ఉండాలని భావించారు.
ఈ క్రమంలోనే ఆయన కుమారుడు, ప్రస్తుత సీఎం జగన్ తో మీడియాను ఏర్పాటు చేయించారు. దీంతో ఆ ప్రధాన పత్రిక వ్యాపారం భారీగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో కొన్నేళ్లపాటు జగన్‌ను కూడా టార్గెట్ చేసింది. పత్రిక మూలాలను ప్రశ్నించింది. మొత్తానికి దీనిపై కేసున మోదు వరకు విషయం వెళ్లింది. ఇక, నిన్నటికి నిన్న జరిగిన ఎన్నికల్లోనూ చంద్రబాబుకు అనుకూలం గా వార్తలు రాసిన ఈ మీడియా.. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక మాత్రం వ్యూహం మార్చుకున్నట్టు తెలుస్తోంది. పెద్దగా ఎలాంటి వ్యతిరేక వార్తలులేక పోవడం ఒక విశేషమైతే.. నిజంగానే ఉన్న వ్యతిరేకతను కూడా తగ్గించి చూపడం, జగన్ పట్ల సానుబూతిని వ్యక్తం చేస్తూ.. పాజిటివ్ కథనాలు రాయడం పెద్ద సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు అసలు ఈ పత్రికకు-జగన్‌కు మధ్య ఏం జరిగిందనే విషయం చర్చకు వస్తోంది. ఎలాగూ టీడీపీ పరిస్థితి అయిపోయిందని ఈ పత్రిక డిసైడ్ అయిందా? లేకజగన్‌తో ఏదైనా లాలూచీ వ్యవహారం చేసుకుందా? ఇవన్నీ కాకుండా అటు తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి జగన్ విషయంలో పాజిటివ్ యాంగిల్ తీసుకోవాలనే సూచనలు అందాయా? అనే చర్చ సాగుతోంది. మరి విషయం ఏంటో తెలియాలంటే. వెయిటింగ్ తప్పదు..!