కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ మృతి చెందారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఈ నెల 9న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో జాయిన్ అయ్యారు. చికిత్స పొదుతున్న ఆయన పరిస్థితి తీవ్రంగా విషమించడంతో మృతిచెందినట్టు తెలుస్తుంది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి హర్షవర్థన్, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే శుక్రవారం ఉదయం ఎయిమ్స్‌కు వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
ఈ నెల 9వ తేదీ రాత్రి నుంచే ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి ఎయిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జైట్లీకి ఎయిమ్స్‌లో మల్టీ డిసిప్లినరీ వైద్యులతో కూడిన బృందం చికిత్స చేసింది. ఆయనకు రక్తపోటు హృదయ స్పందన ఎక్కువుగా ఉండడంతో వాటిని కంట్రోల్‌లోకి తెచ్చేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
గత మోడీ కేబినెట్‌లో కీలకమైన ఆర్థికశాఖా మంత్రిగా ఉన్న జైట్లీ వయస్సు 66 సంవత్సరాలు. అనారోగ్య కారణాల వల్ల 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయలేదు. ఆయన తీవ్ర అనారోగ్యంతో యూఎస్‌లో చికిత్స తీసుకుంటుండడంతో ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ను మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టారు. తాజా ఎన్నికల తరువాత నరేంద్ర మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత, జైట్లీ ప్రధాని మోడీకి లేఖ రాశారు.
తన ఆరోగ్యం క్షీణించినందున ప్రభుత్వంలో ఎటువంటి విధులు / బాధ్యతలు స్వీకరించబోనని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా మోడీ ఆయన్ను రాజ్యసభకు పంపి.. ఏదైనా మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన కూడా చేశారు. అయితే జైట్లీ స్వయంగా తనకు పదవి వద్దని లేఖ రాయడంతో మోడీ ఆయన లేఖ పరిగణలోకి తీసుకుని ఆయనకు పదవి ఇవ్వలేదు.