టీడీపీ పాలనలో రాష్ట్రం అప్పుల పాలు.. ఇప్పుడు బెటర్: మంత్రి బుగ్గన

టీడీపీ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని, ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ఆర్థిక నిర్వహణ, ఆర్థిక క్రమ శిక్షణలో రికార్డు సృష్టిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ అధికారులు బాగా పనిచేశారని ఆయన అభినందించారు. గత ప్రభుత్వ హయాంలో వార్షిక రుణ వృద్ధిరేటు 19.2 శాతం ఉండగా.. వైసీపీ ప్రభుత్వం 15.77 శాతానికి తగ్గించిందని మంత్రి బుగ్గన తెలిపారు. గతంలో రాష్ట్ర ఆర్థిక లోటు జీఎస్‌డీపీలో 4 శాతంగా ఉందని.. ప్రస్తుతం 2.10 శాతంగా ఉందన్నారు.

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

ప్రభుత్వం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) పథకాల కింద లబ్ధిదారులకు రూ.1.46 లక్షల కోట్లు జమ చేసిందన్నారు. ఇతర పథకాల కోసం రూ.44 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. 2014-19 టీడీపీ హయాంలో రూ.27,340 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ పనులు జరగగా.. వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడేళ్లలో రూ.27,448 కోట్ల పనులు చేపట్టిందని మంత్రి బుగ్గన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక స్థితిని శ్రీలంకతో పోల్చిన ప్రతిపక్షాలు తమ తప్పును తెలుసుకోవాలని ఆయన సూచించారు.