కరోనా వైరస్ నేపథ్యంలో భారత్, సౌతాఫ్రికాల నడుమ జరగాల్సిన వన్డే సిరీస్ రద్దైన సంగతి తెలిసిందే. ఇక మార్చి 29వ తేదీ నుంచి జరగాల్సిన ఐపీఎల్ టోర్నీని కూడా ఏప్రిల్ 15వ తేదీ వరకు వాయిదా వేశారు. మరో వైపు అటు కివీస్, ఆసీస్‌ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ కూడా రద్దైంది. అయితే ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. ట్విట్టర్ వేదికగా కరోనాపై ట్వీట్లు చేశాడు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల మనమంతా ధైర్యంగా ఉండాలని, కరోనా వైరస్‌పై పోరాటం చేయాలని కోహ్లి పిలుపునిచ్చాడు. కరోనా వైరస్ వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చాడు. కరోనా వచ్చాక బాధపడడం కంటే అది రాకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నాడు.
Let's stay strong and fight the #COVID19 outbreak by taking all precautionary measures. Stay safe, be vigilant and most importantly remember, prevention is better than cure. Please take care everyone.
— Virat Kohli (@imVkohli) March 14, 2020
కాగా ఇప్పటి వరకు భారత్‌లో మొత్తం 82 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 145 దేశాల్లో కరోనా పంజా విసరగా 1,45,631 మందికి కరోనా సోకింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే కరోనాను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించి పరిస్థితిని అత్యవసరంగా సమీక్షిస్తోంది.