తెలంగాణలో ఆగని లోన్ యాప్ ఆగడాలు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా లోన్ యాప్ ఉచ్చులో వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ పల్లికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు పడ్డాడు. తన అవసరం కోసం లోన్ యాప్ కోసం ప్లే స్టోర్ లో వెతికాడు ఆ యువకుడు. రేటింగ్ బాగుందని వండర్ లోన్ అప్లికేషన్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాడు యువకుడు శ్రీనివాస్.
అనంతరం ఆధార్,పాన్ కార్డ్, సెల్ఫీ తో పాటు తన పూర్తి వివరాలు అప్లోడ్ చేసేశాడు. ఇంట్రస్ట్ ఎక్కువగా ఉందని లోన్ వద్దనుకొని అప్లికేషన్ డిలీట్ చేసినా అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి. వారం తర్వాత లోన్ కట్టాలంటూ లోన్ యాప్ నిర్వహకుల బెదిరింపులు షూరూ చేశారు. లోన్ డబ్బులు మొత్తం కట్టినా ఇంకా కట్టాలంటూ బూతు వాయిస్ మెసేజ్లు పంపారు కేటుగాళ్ళు. అంతేకాకుండా, న్యూడ్ ఫోటోలు కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారందరికీ పంపుతామని బెదిరింపులకు దిగారు. ఇక చేసేదేమి లేక సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.