అనుకున్నది అనుకున్నట్లు జరిగితే..అది లైఫ్ ఎందుకు అవుతుంది..ఏ సినిమా స్క్రిప్టో అవుతుంది కానీ…మనం ఈరోజు ఈ పని చేసేద్దాం, ఇలా అయిపోదాం అనుకుంటాం..కానీ ఏదో ఒక ఆటంకాలు వచ్చేస్తాయి. కొన్నిసార్లు వ్యాపారంలో భారీ నష్టాలు వస్తాయి, ఎంత ప్రయత్నించినా ఒక జాబ్ కూడా రాదు, ఎంత చదివినా ఒక్క ముక్క అర్థంకాదు..ఇలా ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్లకు ఉంటాయి..అసలు లైఫ్ లో హ్యాపీగా ఉండేవాళ్లు చాలా తక్కువుగా ఉంటారు. అయితే వచ్చిన ప్రతి కష్టానికి కుంగిపోకుండా..రెట్టింపు ఉత్సహాంతో ముందుకు వెళ్లినప్పుడే..గెలుపు తలుపు తడుతుంది..ఇప్పుడు చెప్పుకోబోయే కథ వింటే..మీరు ఒకవేళ ఆమె ప్లేసులో ఉంటే..ఏదో ఒక స్టేజ్ లో గివప్ ఇచ్చే వాళ్లేమో..అన్ని కష్టాలను ఎదుర్కోని చివరకి విజయాన్ని సాధించింది.
జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఇన్షా 15 ఏళ్ల వరకు అందరమ్మాయిల్లాగే భవిష్యత్తుపై బోలెడన్ని ఆశలతో ఉండేది.. అవేవీ నెరవేరకుండా ఓ ప్రమాదం తనని శాశ్వతంగా చక్రాల కుర్చీకే పరిమితం చేసింది. ఇందుకు మొదట్లో కుంగిపోయినా ఆ తర్వాత తన కెరీర్‌పై దృష్టి పెట్టింది ఇన్షా. తన ప్రాణానికి ప్రాణమైన బాస్కెట్ బాల్‌ను ఎంచుకొని.. ఇప్పుడు కశ్మీర్‌లోనే ‘తొలి వీల్‌ఛైర్ బాస్కెట్ బాల్ క్రీడాకారిణి’గా ఎదిగింది. తనలాంటి శారీరక లోపాలున్న అమ్మాయిల్ని క్రీడల్లో ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ యంగ్ ప్లేయర్.. మరోవైపు పారాలింపిక్స్‌లో పాల్గొని దేశానికి పతకం అందిస్తే జీవితం సార్థకమవుతుందంటోంది.
‘ఎందుకు బతికావు?’ అన్నారు!
జీవితంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో సాధించాలని కలలు కన్నా. ప్రమాదం తర్వాత డాక్టర్ చెప్పిన మాటలు విని క్షణాల్లోనే నా కలల సౌధం కూలిపోయింది. భవిష్యత్తంతా అంధకారమైపోయినట్లనిపించింది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చేవి. ఇలా వీటికి తోడు బంధువులు తమ మాటలతో రాబందుల్లా పొడుచుకు తినేవాళ్లట… ‘ఇలా జీవచ్ఛవంలా బతికే బదులు అప్పుడే చనిపోయి ఉండాల్సింది..’ అంటూ తమ మాటలతో హింసించేవారు. ఇలాంటి ప్రతికూల సమయంలోనే నాన్న నా వెన్ను తట్టారు. జీవితంపై ఓ ఆశ కల్పించారు.. ఈ క్రమంలోనే శ్రీనగర్‌లోని ఓ రీహ్యాబిలిటేషన్ సెంటర్‌లో కొన్ని నెలల పాటు ఫిజియోథెరపీ చికిత్స తీసుకున్నా..’ అంటూ తన జీవితంలో ఎదురైన చీకటి రోజులను చెప్పుకుని కంట తడిపెట్టింది ఇన్షా.
ఎంబీబీఎస్ లో అర్హత
ఓవైపు శారీరకంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూనే మరో వైపు చదువుపై దృష్టి పెట్టింది ఇన్షా. ఈ క్రమంలోనే డాక్టర్ కావాలన్న కోరికతో ఎంబీబీఎస్ పరీక్ష రాసి అర్హత కూడా సాధించింది. కానీ వివిధ కారణాల వల్ల ఆ ఆశయాన్ని విరమించుకున్న ఆమె.. బీఏ, బీఈడీ పూర్తి చేసింది. అయితే చిన్న వయసు నుంచే ఆటలపై మక్కువ చూపడంతో ఫిజియోథెరపీ తీసుకునే క్రమంలోనే బాస్కెట్ బాల్‌ను తన కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకుందట.
వారిని చూసి..చిగురించిన ఆశ
‘ఫిజియోథెరపీ తీసుకునే క్రమంలోనే పురుషుల వీల్‌ఛైర్ బాస్కెట్ బాల్ జట్టును కలిసి… అవరోధాల్ని అధిగమిస్తూ వారు సాధన చేస్తుంటే తనకు ఆశ్చర్యంగా అనిపించిందేట..బాస్కెట్‌బాల్‌ను తన కెరీర్ ఆప్షన్‌గా ఎందుకు ఎంచుకోకూడదు? అనుకుంది..కానీ అప్పటికి పురుషుల మాదిరిగా మహిళల వీల్‌ఛైర్ బాస్కెట్‌బాల్ జట్టు జమ్మూకశ్మీర్‌లో లేదు. దీంతో కొన్నాళ్ల పాటు పురుషులతోనే సాధన చేసింది.. దేశంలో ఎక్కడ మహిళల వీల్‌ఛైర్ జట్ల శిక్షణ శిబిరాలు జరిగినా రీహ్యాబిలిటేషన్ సెంటర్ వారి చొరవతో అక్కడికి వెళ్లేది.. అలా బాస్కెట్‌బాల్‌లో నైపుణ్యాలు సాధించాక దేశవ్యాప్తంగా పలు పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చిందట.
తనకు తానే స్ఫూర్తిగా..!
తన ప్రతిభను గుర్తించి ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్ విజిటర్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు యూఎస్ కాన్సులేట్ నుంచి ఆహ్వానం కూడా అందుకుంది. ప్రస్తుతం రెస్ట్ ఆఫ్ ఇండియా విమెన్స్ బాస్కెట్ బాట్ జట్టులో సభ్యురాలిగా ఇన్షా కొనసాగుతోంది. మరోవైపు తనలాంటి శారీరక లోపాలున్న అమ్మాయిల్లో స్ఫూర్తి నింపడానికి సోషల్ మీడియా వేదికగా వాళ్లతో టచ్‌లో ఉంటూ స్ఫూర్తిదాయక మాటలు చెబుతుంటుంది. మరోవైపు టెడెక్స్ వంటి వేదికల పైనా తన జీవితానుభవాల్ని పంచుకుంటూ నేటి యువతలో స్ఫూర్తి నింపుతోంది.
శారీరక లోపాలున్నా తమను తాము నిరూపించుకోవాలనుకుంటోన్న అమ్మాయిలల్లో బాస్కెట్‌బాల్‌పై మక్కువ చూపే వారూ చాలామంది ఉన్నారట.. అలాంటి వారందరినీ కలిపి ఒక జట్టుగా తయారుచేస్తే.. జమ్మూకశ్మీర్‌లో ఆల్ విమెన్ వీల్‌ఛైర్ బాస్కెట్ బాల్ టీమ్ లేదన్న అంసతృప్తికి తెరపడుతుంటోంది..ఇన్షా
-Triveni Buskarowthu