బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ రాజీనామా

-

బ్రిటన్‌ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ (42) తన పదవికి రాజీనామా చేశారు. శాఖాపరమైన కమ్యూనికేషన్‌ కోసం ఆమె పొరపాటున తన వ్యక్తిగత ఈ-మెయిల్‌ను ఉపయోగించుకోవడమే అందుకు కారణం.

బ్రేవర్మన్‌ భారత సంతతి నాయకురాలు. ఆమె హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టి 43 రోజులే అయింది. కేబినెట్‌ నుంచి ఆమె నిష్క్రమణ ప్రధాని లిజ్‌ ట్రస్‌ నేతృత్వంలోని సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ. మినీ బడ్జెట్‌లో చేసిన పన్ను కోత ప్రతిపాదనలపై తీవ్ర దుమారం చెలరేగడంతో.. గత శుక్రవారమే క్వాసీ క్వార్టెంగ్‌ను ఆర్థిక మంత్రి పదవి నుంచి ట్రస్‌ తప్పించారు. ప్రధాని రాజీనామా చేయాలంటూ కొన్నిరోజులుగా స్వపక్ష నేతల నుంచీ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

“వలస విధానాలపై రూపొందించిన ఓ ముసాయిదాను విశ్వసనీయ పార్లమెంటరీ సహచరుడికి నా వ్యక్తిగత ఈ-మెయిల్‌ నుంచి పంపించాను. పొరపాటు జరిగింది కాబట్టి నేను రాజీనామా చేయడమే సబబు. నా పొరపాటును గుర్తించిన వెంటనే అధికారిక వర్గాలకు సమాచారం అందించాను” అని బ్రేవర్మన్‌ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news