ఆదివారం అంతా అంబటి రాంబాబే ఉన్నారు. ఆదివారం తరువాత సోమవారం కూడా అంబటి రాంబాబే ఉంటారు. కానీ చంద్రబాబు మాదిరిగా కనీసం ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శన కో,సోమశిల ప్రాజెక్టు సందర్శనకో, శ్రీశైలం ప్రాజెక్టు సందర్శనకో వెళ్తే ఎంత బాగుంటుంది. కానీ ఆయన ఆ పని చేయరు. చేయాలని ఉంటుంది కానీ చేయరు. అమరావతి దాటి వస్తే పదవికి గండం అన్న విధంగా ఆయన బతికేస్తున్నారు అని విపక్షం విమర్శిస్తోంది. కానీ ఆయన మాత్రం ఎప్పటిలానే దత్తపుత్రుడు అన్న టాపిక్ తీసుకుని ఇవాళ మీడియా ఎదుట పవన్ ను తిట్టారు. టు ద పాయింట్ ఏమయినా ప్రాజెక్టుల గురించి మాట్లాడండి అంటే నేనేమయినా సాంకేతిక నిపుణుడినా లేదా కాంట్రాక్టరునా అని ఎదురు ప్రశ్నిస్తున్న జలవనరుల శాఖ మంత్రి అంబటికి దూషణలు చేయడం తప్ప మరొక ఆలోచన లేదు అని జనసేన మండిపడుతోంది. ఆయనను పదే పదే ట్రోల్ చేస్తోంది కూడా !
సినిమాలు చేసుకుని బతికేవాడివి ఎందుకు నీకు రాజకీయాలు అని తిట్టారు పవన్ ను. పాపం పవన్ వినిపించుకోకుండా వీళ్ల సంగతి తెలియకుండా ఇటుగా వచ్చేరు. తిట్లు తింటున్నారు ప్రతిరోజూ. కానీ అంబటి లాంటి మంత్రివర్యులు పోలవరం గురించి వివరంగా చెప్పడం మాత్రం నేర్చుకోవడం లేదు కానీ పవన్ ను మాత్రం ప్రతిరోజూ తిడుతుంటారు. డయాఫ్రం వాల్ గురించి కానీ స్పిల్ వే గురించి మాట్లాడే స్కిల్ ఒకటి ఆయనకు ఎందుకనో రావడం లేదు అని ఓ వాదన. అయినా ఇవి రాజకీయాలకు అవసరం అయిన విషయాలు కావు. కేవలం తిట్టుకోవడం ఒకరినొకరు దూషించుకోవడం మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ విధంగా నిన్నటి దాకా పేర్ని, కొడాలి, వెల్లంపల్లి స్థానంలో ఇప్పుడు కొట్టు (సత్యనారాయణ ), అంబటి (రాంబాబు), గుడివాడ (అమర్నాథ్) వచ్చి చేరారు. ఒకరు దేవాదాయ, ఇంకొకరు జలవనరుల, మరొకరు పరిశ్రమల శాఖలను నిర్వరిస్తున్నారు.గత ప్రభుత్వం తిట్టిన వారు సినిమాటోగ్రఫీ, పౌర సరఫరాల, దేవాదాయ శాఖలు చూసిన మంత్రులు.పాపం వీళ్లంతా ఇళ్లకే పరిమితం అయి ఉన్నారు. అప్పుడప్పుడూ బయటకు వచ్చి మాట్లాడడం కొడాలి నానికి మాత్రమే ఇష్టం అన్న విధంగా రాజకీయం నడుస్తోందని జనసేన అంటోంది. ఏదేమయినప్పటికీ పవన్ స్క్రీన్ ప్లే రాస్తే అంబటి సినిమా తీస్తారా? పోనీ వ్యక్తిగత విషయాలు అటుంచి ఆయన మాదిరిగానే కౌలు రైతులకు, బాధిత వర్గాలకు అండగా ఉంటారా అని ప్రశ్నిస్తోంది జనసేన.. నిలదీస్తోంది జనసేన.