తెలుగు చలన చిత్ర రంగంలో సూపర్‌స్టార్, దర్శకుడిగా ముద్రవేసుకున్న ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ (శివరామ కృష్ణమూర్తి) మంగళవారం తెల్లవారు జామున గచ్చిబౌలిలోని కాంటినెంటల్ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబంతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోక సంద్రంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు నానక్‌రామ్‌గూడ నివాసంలోని ఆయన పార్థివదేహాన్ని కడసారి చూసి నివాళులర్పించారు. కృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
అయితే.. సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని నానక్‌రామ్‌గూడలో ఆయన నివాసం విజయకృష్ణ నిలయం నుంచి పద్మాలయ స్టూడియోకు తరలించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని అక్కడే ఉంచనున్నారు. ఆ తర్వాత జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం కార్డియాక్ అరెస్ట్ కావడంతో కుటుంబసభ్యులు కృష్ణను హుటాహుటిన కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు ఆయనను కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటికి తీసుకురాగలిగినా ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. చికిత్సపొందుతూ మంగళవారం తెల్లవారుజామున కృష్ణ కన్నుమూశారు.