భారత్‌లో బీబీసీని నిషేధించాలంటూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇండియా-ద మోదీ క్వశ్చన్ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందంటూ ఈ డాక్యుమెంటరీని ఇప్పటికే కేంద్రం నిషేధించింది.
ఈక్రమంలో దేశంలో బీబీసీ, బీబీసీ ఇండియాను బ్యాన్ చేయాలంటూ హిందూ సేన సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిల్‌పై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఒక డాక్యుమెంటరీ దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది.. ఒక ఛానల్‌ను బ్యాన్ చేయాలన్న ఆదేశాలను సుప్రీంకోర్టు ఎలా జారీ చేస్తుంది’’ అంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.
అసలేంటి బీబీసీ డాక్యుమెంటరీ..?
2002లో గోద్రా ప్రాంతంలో అల్లర్లు జరిగినప్పుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ పాత్రను విమర్శనాత్మకంగా చూపించింది బీబీసీ మీడియా సంస్థ. ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ పేరుతో రెండు ఎపిసోడ్ల సిరీస్‌ను బీబీసీ రూపొందించింది. ఇందులో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ ప్రభుత్వం దీని ప్రసారంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.