బిల్కిస్ బానో రేపిస్టుల విడుదలపై నవంబర్ 29న సుప్రీంకోర్టు విచారణ

-

బిల్కిస్ బానో రేపిస్టులను విడుదల చేయడంపై సుప్రీం కోర్టు నవంబర్ 29న విచారణ జరపనుంది. గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. 2002 గోద్రా అల్లర్ల సమయంలో జరిగిన బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసుకు సంబంధించిన 11 మంది నిందితులను గుజరాత్‌ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే.

 

కేసు విచారణ సందర్భంగా గుజరాత్‌ ప్రభుత్వం దాఖలు చేసిన సమాధానాన్ని అన్నిపక్షాలకు అందుబాటులో ఉంచాలని జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని కోరగా ఈ మేరకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కేసులో ప్రమేయం ఉన్న న్యాయవాదులందరికీ కౌంటర్ అఫిడవిట్ల కాపీలను అందజేయాలని కోర్టు గుజరాత్‌ ప్రభుత్వం, నిందితుల తరఫు న్యాయవాదికి సూచించింది.

మరోవైపు.. గుజరాత్‌ ప్రభుత్వం దోషుల విడుదలపై సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. హోంమంత్రిత్వ శాఖ ఆమోదం అనంతరమే దోషులను విడుదల చేసినట్లు గుజరాత్‌ సర్కారు తెలిపింది. బిల్కిస్‌ బానో కేసులో 11 మంది నిందితులపై నిర్ణయం తీసుకునే ముందు 1992 నాటి రిమిషన్‌ పాలసీ కింద అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నట్లు అఫిడవిట్‌లో గుజరాత్‌ సర్కార్ పేర్కొంది. దోషులు సత్ప్రవర్తనతోపాటు 14 సంవత్సరాలకుపైగా జైలు శిక్ష అనుభవించినందునే శిక్షను తగ్గించి విడుదల చేసినట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news