ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లు విచారించాలని సుప్రీం కోర్టులో ఏపీప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు. దీనిపై అమరావతి ప్రాంత రైతులు, ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ ఈ కేసులో తమకు న్యాయస్థానం ఇచ్చిన నోటీసులు జనవరి 27న అందాయని పేర్కొన్నారు. ఆరోజే తాము ఈ విషయాన్ని ప్రస్తావించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ విచారణ జరగనందున తమకు ఇప్పటి నుంచి కనీసం 2 వారాల సమయం ఇస్తే కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. రైతుల తరఫు న్యాయవాదులకే ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు సమర్థించారు.
ఇరుపక్షాలు ప్రస్తావించిన అంశాలపై చర్చించిన అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం స్పష్టం చేసింది. ఆలోపు ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని.. మరోవైపు ప్రభుత్వం కూడా ఆలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.