న్యాయమూర్తుల నియామకంలో జాప్యంపై సుప్రీం కోర్టు ఫైర్ అయింది. ఆలస్యానికి గల కారణమేంటో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం. కొలీజియం పేర్లు సిఫార్సు చేసినా హైకోర్టులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడింది. ఆ పేర్లను ఉపసహరించుకునేలా చేసేందుకు ఈ జాప్యం ఓ సాధనంగా మారిందని వ్యాఖ్యానించింది.
బెంగళూరు న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన ఓ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. న్యాయమూర్తుల నియామకంలో జాప్యానికి గల కారణాలను తాము అర్థం చేసుకోలేకపోతున్నామని, అందుకే నియామకాల్లో జాప్యంపై కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని స్పందించాలని ఆదేశించింది. ఈ పిల్‌పై తదుపరి విచారణను నవంబరు 28కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.