ప్రముఖ టీవీ నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ (46) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఫిట్‌నెస్‌పై ఎంతో ఆసక్తి కలిగిన సిద్ధాంత్ వ్యాయామం చేస్తూ ఇవాళ జిమ్‌లోనే అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. మధ్యాహ్నం 12.30గంటల సమయంలో హుటాహుటిన ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
‘‘సూర్యవంశీని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నం చేశారు. జిమ్‌లో ఉన్నప్పుడే బహుశా గుండెపోటు వచ్చినట్టుంది’’ అని వైద్యులు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ కుటుంబ సభ్యులకు తెలిపినట్టు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ‘కుసుమ్, కసౌటి జిందగీ కే’, జిద్దీ దిల్ మానే నా’ వంటి అనేక షోలలో నటించి అభిమానుల్ని మెప్పించిన సిద్ధాంత్.. ఆకస్మిక మరణం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఆయనకు భార్య అలేసియా రౌత్, కుమార్తె, కుమారుడు ఉన్నారు. జిమ్‌లో వర్కవుట్లు చేస్తుండగా, గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలి పలువురు నటులు ప్రాణాలు కోల్పోవడం చిత్ర పరిశ్రమలో విషాదం నింపింది.