ఉమ్మడి హైకోర్టు విభజనపై సోమవారం సుప్రీం కోర్టు ఎనిమిది పేజీలతో కూడిన ఉత్తర్వులను జారీ చేసింది. ఏపీలో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న హైకోర్టు పట్ల సుప్రీం సంతోషం వ్యక్తం చేసింది. మౌలిక వసతులు సిద్ధమైతే పూర్తిస్థాయి ఏపి, తెలంగాణ హైకోర్టుల ఏర్పాటు అవుతాయని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. రాబోయే నూతన ఏడాది జనవరి 1 నుంచి అమరావతిలో హైకోర్టు కార్యకలాపాలు నిర్వహించాలని న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ని జనవరి 1లోగా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని సుప్రీం సూచించింది. నోటిఫికేషన్ జారీ అనంతరం ఏపి, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా విధులు నిర్వహించడం ప్రారంభమవుతుంది. న్యాయమూర్తులకు శాశ్వత నిర్మాణాలు పూర్తికాకపోతే తాత్కాలికంగా ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌తో కోర్టు సంతప్తి వ్యక్తం చేసింది.
ఏపి హైకోర్టు కొత్త భవనం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, ఈ ఏడాది డిసెంబర్ 15 నాటికి తాత్కాలిక భవనాలు సిద్ధమవుతాయని ఏపి ప్రభుత్వం కోర్టుకు నివేదించిన విషయం తెలిసిందే.. జనవరి 1న కొత్త రాజధానిలో హైకోర్టు ప్రారంభమవుతుందని ఆశిస్తున్నామని, అతి త్వరలో రెండు రాష్ట్రాల్లో హైకోర్టులు కార్యకలాపాలు కొనసాగిస్తాయని సుప్రీం కోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. ఏపీకి వెళ్లేందుకు న్యాయమూర్తులు చొరవ చూపడంతో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఏపీ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న హైకోర్టు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి , ప్రజలకు సుప్రీం శుభాకాంక్షలు తెలిపింది.