సుప్రీంకోర్టు కార్యకలాపాలను ఇక నుంచి లైవ్లో చూడొచ్చు. అదేనండి సుప్రీం కోర్టు కేసులు విచారిస్తున్నప్పుడు ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారంలో చూడటానికి వీలుంది. న్యాయస్థానం కార్యకలాపాలను లైవ్ ద్వారా ప్రసారం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయంపై సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి వచ్చారు. మంగళవారం సాయంత్రం సుప్రీంకోర్టు ఫుల్ కోర్టు సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
విచారణ ప్రత్యక్ష ప్రసారంపై న్యాయమూర్తులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేయగా.. సుప్రీంకోర్టు సిబ్బంది అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారం(సెప్టెంబర్ 27) నుంచి కేసుల విచారణ లైవ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తొలుత రాజ్యాంగ ధర్మాసనం కేసుల్ని మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
వాస్తవానికి సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు 2018లోనే అనుమతి లభించింది. రాజ్యాంగం, జాతీయ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. అప్పట్లో రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వచ్చే కొన్ని కేసుల ప్రత్యక్ష ప్రసారానికి అంగీకారం తెలిపింది సర్వోన్నత న్యాయస్థానం.