సిక్కులు తలపాగా ధరించడం, కిర్పాన్, ఖడ్గం వంటివి ధరించడంపై సుప్రీం కోర్టు ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది. సిక్కులు ధరించే ఈ దుస్తులతో హిజాబ్‌ను పోల్చడం సముచితం కాదని స్పష్టం చేసింది. కర్ణాటక ప్రభుత్వం విద్యా సంస్థల్లో హిజాబ్ ధారణపై విధించిన నిషేధం, దానిని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం ముందు గురువారం వాదనలు జరిగాయి.
ఈ సందర్భంగా సిక్కుల ఆచారాల విషయాన్ని ఓ న్యాయవాది ప్రస్తావించారు. హిజాబ్‌తో సిక్కుల సంప్రదాయాలను పోల్చడం సరికాదని ధర్మాసనం సూచించింది. భారతీయ సమాజంలో సిక్కుల ఆచారాలు మమేకమై పోయాయని, రాజ్యాంగ అధికరణం 25లోనూ కడియం(కిర్పాన్) ప్రస్తావన ఉందని తెలిపింది. శాంతిభద్రతలకు అంతరాయం కలిగించే అంశాలపై వాదోపవాదనలు జరిగాయి. హిజాబ్ ధారణ ముస్లింల ఆచారంలో భాగమేనని ఓ న్యాయవాది పేర్కొనగా.. విద్యా సంస్థల నిబంధనల్ని పాటించాల్సిన ఆవశ్యకతను ధర్మాసనం గుర్తు చేసింది. తదుపరి వాదనలు ఈ నెల 12న కొనసాగనున్నాయి.